హైదరాబాద్: ఒకటి కాదు, రెండు కాదు రు.22.5 కోట్ల భారీ చోరీ. చేసింది పెద్ద గజదొంగో, బందిపోటో కాదు. ఒక వ్యాన్ డ్రైవర్. ఈ చాకిరీ ఎన్నాళ్ళు చేస్తాం… కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనుకున్నాడో, ఏమో ఒకేసారి రు.22.5 కోట్లకు టెండర్ పెట్టేశాడు. ఇంతకీ ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో. ఏటీఎంలలో డబ్బుపెట్టే సంస్థలో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రదీప్ అనే వ్యక్తి ఈ నేరానికి పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం రు.22 కోట్లు ఉన్న వ్యాన్ ఏటీఎంలలో నగదు పెట్టటానికి బయలుదేరింది. ఒక ఏటీఎం దగ్గరకు వెళ్ళగానే సెక్యూరిటీ గార్డ్ దిగిన తర్వాత పార్కింగ్‌కు వీలవటంలేదు, కొద్దిగా దూరంగా పార్క్ చేస్తానంటూ డ్రైవర్ ప్రదీప్ ఉడాయించాడు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నగరమంతా జల్లెడ పట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా అతని ఆనవాళ్ళు దొరికాయి. చివరికి నగరంలోని ఓఖ్లా ప్రాంతంలో ప్రదీప్ దొరికిపోయాడు. చోరీ సొమ్మునుకూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రు.22 కోట్లలో రు.11,000 మాత్రం తగ్గింది. అతను ఈ డబ్బుతో కొత్త బట్టలు కొనుక్కుని దాక్కున్న ప్రదేశంలో నిద్రపోయాడని పోలీసులు తెలిపారు. ఇతనికి ఈ చోరీలో మరికొంతమంది సహకరించినట్లు పోలీసులు కనుగొన్నారు. వారికోసం గాలింపు చేపట్టారు. నగరంలో ఇంత పెద్ద నగదు దొంగతనం జరగటం ఇదే మొదటిసారని పోలీసులు చెబుతున్నారు.