ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు పొత్తుల కోసం ఎత్తులు, సీట్ల సర్దుబాట్ల కోసం అవస్థలు, ఆపైన అలకలు మామూలేనని బిహార్ ఎన్నికలు మరోసారి తాజాగా చాటిచెబుతున్నాయి. సీట్ల సర్దుబాటు చేసుకుని చేతులుకలుపుకుని 24గంటలు కూడా గడవకముందే బిహార్ ఎన్డీయేలో అలుకల పర్వం మొదలైంది.
భారతీయ జనతాపార్టీ మతపరమైన పార్టీ అనీ, దాన్ని నామరూపాలులేకుండా నలిపేయాలని లౌకిక పార్టీలు ఎన్నికల పొత్తుపెట్టుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుంటే, మరో పక్కన బీజేపీ నాయకత్వంలోని ఎన్ డిఏ కూడా తమ సత్తా ఏమిటో బిహార్ లో చూపాలని ఉవ్విళ్లూరుతోంది. ఈనేపథ్యంలోనే బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ పార్టీ (హిందుస్తానీ అవామ్ మౌర్చా)తో బిజేపీ పొత్తును బలపరుచుకుని సీట్ల సర్దుబాటుకూడా చేయించుకుంది. దీంతో దళిత వర్గాల ఓట్లు తమ కూటమి బుట్టలో పడతాయన్నది బిజేపీ ఊహ.అంతేకాదు, తమదీ సెక్యులర్ కూటమేనని చాటిచెప్పాలన్న తపన. అయితే, కూటమి సీట్ల సర్దుబాటుపై ఇదే కూటమిలోని మరో పార్టీ ఎల్ జెపీ అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. సీట్ల సర్దుబాటు పూర్తయిందని బీజేపీ ఊపిరిపీల్చుకునేలోపే ఎల్ జెపీ పెదవివిరుపు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ నాయకుడు ఛిరాగ్ పాశ్వన్ విలేకరుల సమావేశంలో ముఖం చిట్లించడం గమనార్హం.
నచ్చలేదు
బిహార్ లో 243 అసెంబ్లీ స్థానాలకోసం అక్టోబర్ 12 నుంచి ఐదు విడతలుగా పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు నవంబర్ 8న ప్రకటిస్తారు. మొత్తం 243 స్థానాలకుగాను, 20 సీట్లను మహాదళిత్ నాయకుడైన జితన్ రామ్ మాంఝీ పార్టీ (హెచ్ ఎఎం- ఎస్)కి ఇచ్చేయగా, రాంవిలాస్ పాశ్వాన్ పార్టీ (ఎల్ జేపీ)కి 40 సీట్లు కేటాయించారు. కాగా, కేంద్రమంత్రి ఉపేంద్ర కుష్వాన్ కి చెందిన ఆర్.ఎల్.ఎస్.పికి 23 సీట్లు ఇచ్చారు. ఇక బిజేపీ 160 సీట్లు ఉంచుకుంది.
తమ పార్టీకి ఇచ్చిన సీట్ల సంఖ్య తమకు నచ్చలేదని ఎల్ జేపీ నాయకులు అంటున్నారు. ఈ సీట్ల లెక్కల గారడీలో తాము పావులం కాదలుకోలేదని ఈ పార్టీ అభిప్రాయపడుతోంది. ఇదేమీ ఆవేశం, ఆగ్రహంకాదనీ, కేవలం అసంతృప్తిమాత్రమేనని ఛిరాగ్ అంటున్నప్పటికీ ఈ తరహా వ్యాఖ్యలే బిజేపీ అగ్రనాయకుల్లో ప్రకంపనాలు పుట్టిస్తాయని ఆపార్టీ నేతలకు బాగాతెలుసు. మరి తనకోటాలోని సీట్లను కుదించుకుని మరికొన్ని సీట్లను ఎల్ జేపికి అప్పగిస్తుందేమో వేచిచూడాలి.
పప్పులో కాలు
బిజేపీ దాని కూటమి ఎన్ డిఏ ఈ ఎన్నికలను పెనుసవాలుగానే తీసుకుంది. తమ కూటమి కచ్చితంగా మెజార్టీ స్థానాలను గెలుచుకుని బిహార్ లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని బిజేపీ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తంచేస్తున్నారు. అవతలి కూటమి (నితీశ్, లాలూ, సోనియా) నాసిరకంగా ఉన్నదనీ, రాబోయే ఎన్నికల్లో అడ్రెస్ లేకుండాపోతుందన్నది బిజేపీ అభిప్రాయం. తమ కూటమిలోని నాలుగు పార్టీలు (బిజేపీ, ఎల్ జెపీ, హెచ్ ఏఎం (ఎస్), ఆర్.ఎల్ఎస్.పీ)లు భావసారూప్యమున్నవని, అదే మరో పక్క అసంబద్ధమైన కూటమి (జెడి-యు, ఆర్ జెడీ , కాంగ్రెస్) దిక్కులేని పరిస్థితుల్లో ఏర్పడిందని అమిత్ షా అంటున్నారు.
బిహార్ ఎన్డీయే కూటమిలో పాశ్వాన్ కంటే జితన్ రామ్ మాంఝీమీద బీజేపీ మమకారం ఎక్కువగా చూపిస్తోందనీ, అయితే, శక్తివంతమైన పార్టీ ఎల్ జేపీనేనని, ఈ విషయం పట్టించుకోకుండా బిజేపీ పప్పులో కాలేసిందని జనతాదళ్ (యు) నాయకుడు సంజయ్ సింగ్ కామెంట్ చేయడం ఓ రకంగా ఎల్ జేపీని రెచ్చగొట్టడానికే అనుకోవాలి.
కాగా, మరోపక్కన ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా అంతే ధీమాతో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఎలాగైనా బిహార్ లో గెలవాలన్న పట్టుదలతో మోదీ ఉన్నారనీ, అయితే, అతని ఎత్తులూ, జిత్తులు ఇక్కడ పనిచేయవని అంటున్నారు. మొత్తానికి బిహార్ ఎన్నికలు ప్రధానమంత్రి మోదీ, ప్రస్తుత బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ మధ్యనే అన్నట్టుగా హోరాహోరీగా పోరు మొదలైంది.
– కణ్వస