హైదరాబాద్: బీహార్‌లో ఐదో దశ ఎన్నికల పోలింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియటంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇక ఫలితాలే తరువాయి. ఇదిలా ఉంటే పోలింగ్ పూర్తవటంతో ఎగ్జిట్ పోల్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు వచ్చిన సర్వేలలో నాలుగు సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో రెండింటిలో జేడీయూ కూటమికి మెజారిటీ వస్తుందని, మిగిలిన రెండు ఎగ్జిట్ పోల్స్ లో రెండు కూటముల మధ్య పోటీ హోరా హోరీగా ఉందని పేర్కొన్నారు. న్యూస్ 24-చాణక్య మాత్రం బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని చెప్పింది.
బీహార్‌లో మొత్తం స్థానాలు 243 ఉండగా – ‘టైమ్స్ నౌ’ – సి ఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్‌లో జేడీయూ కూటమికి 122, ఎన్డీఏ కూటమికి 111, ఇతరులకు 10 సీట్లు వస్తాయని చెబుతున్నారు. మరోవైపు ‘ఇండియా టుడే’ – సినేరో సర్వే ప్రకారం జేడీయూ కూటమికి 117, ఎన్డీఏ కూటమికి 120, ఇతరులకు 6 సీట్లు లభిస్తాయి. మరోవైపు ‘న్యూస్ ఎక్స్’ సర్వేలో జేడీయూ కూటమికి 135, ఎన్డీఏ కూటమికి 95, ఇతరులకు 13 స్థానాలు లభిస్తాయని అంటున్నారు. ఇక ‘ఏబీపీ’ ఛానల్ ఎగ్జిట్ పోల్ ప్రకారం జేడీయూ కూటమికి 130, ఎన్డీఏ కూటమికి 108, ఇతరులకు 5 లభిస్తాయి. ఇక ‘న్యూస్ 24’-చాణక్య సర్వేలో ఎన్డీఏ కూటమికి 155 సీట్లు, మహా కూటమికి 83 సీట్లు లభిస్తాయని పేర్కొంది.
ఎగ్జిట్ పోల్ ఫలితాలను బీజేపీ కొట్టిపారేసింది. బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసితీరుతామని ధీమా వ్యక్తం చేసింది. తమ అంతర్గత సర్వేలో బీజేపీదే విజయమని తేలిందని, నితీష్ శకం ముగిసిందని వ్యాఖ్యానించింది. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ ఈ సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తమ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని, 190 సీట్లు వస్తాయని ప్రకటించారు. ఇదిలా ఉంటే మొత్తం ఐదు దశలలో కలిసి 57 శాతం పోలింగ్ నమోదయింది. ఇది ఒక రికార్డేనని చెబుతున్నారు. తుది ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి.