బీహార్లో గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 22 స్థానాల్లో గెలిచింది. ఈ సారి పదిహేడు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. అంటే.. గత ఎన్నికల్లో గెలిచిన ఐదు సిట్టింగ్ స్థానాల్లో పోటీ కూడా చేయలేకపోతోంది. ప్రస్తుత రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. బీహార్ రాజకీయ పరిస్థితులు నిరూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీహార్లో బీజేపీ, ఎల్జేపీ, ఆల్ఎల్ఎస్పీ పార్టీలు కలసి కూటమిగా పోటీ చేశాయి. బీహార్లో ఉన్న 40 స్థానాల్లో 31 గెలుచుకున్నారు. వీటిలో ఇరవై రెండు బీజేపీ, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ లోక్ జనశక్తి ఆరు, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ మూడు స్థానాలు గెలుచుకున్నాయి. జేడీయూ ఒంటరిగా పోటీ చేసి రెండు స్థానాలకు పరిమితం అయింది. ఆర్జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీ కలసి పోటీ చేసి ఏడు స్థానాలు గెలుచుకున్నాయి. కానీ ఇప్పుడు.. బీజేపీ.. పదిహేడు స్థానాల్లోనే పోటీ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది.
నరేంద్రమోడీని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నిర్ణయించడంతో.. అప్పటి వరకూ ఎన్డీఏలో ఉన్న జేడీయూ.. గుడ్ బై చెప్పేసింది. ఆ సమయంలో.. బీజేపీ పాశ్వాన్, కుష్వాహాలతో పొత్తు పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచింది. ఆ తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఫార్ములా పని చేయలేదు. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ జత కట్టడంతో.. బీజేపీ ఓడిపోయింది. అయితే అధికారం కావాలన్న యావతో.. లాలూను జైలుకు పంపించి.. ఆ పార్టీని ప్రభుత్వం నుంచి బయటకు గెంటేలా ప్లాన్ చేశారు.. అమిత్ షా, నితీష్ కుమార్. అలాగే చేసి.. ఆర్జేడీని బయటకు పంపి.. రాత్రికి రాత్రి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా మారిపోయింది. కానీ.. ఇప్పుడు లోక్సభ సీట్ల పంపిణీ పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే.. జేడీయూ… గతంలో బీజేపీతో కలిసి ఉన్నప్పుడు… మేజర్ పార్టీ. ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేది. కానీ ఇప్పుడు పార్లమెంట్ సీట్లలో ఆ పార్టీకి రెండు మాత్రమే సిట్టింగ్ సీట్లు. కానీ బీజేపీకి ఇరవై రెండు.
తమకు గతంలోలా అత్యధిక సీట్లు ఇవ్వకపోతే.. ఎన్డీఏ నుంచి వెళ్లిపోతానని.. నితీష్ కుమార్ నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. దాంతో అమిత్ షాకు దిగి రాక తప్పలేదు. తమ సిట్టింగ్ సీట్లు తగ్గించుకుని… మరీ జేడీయూకు పదిహేడు సీట్లు ఇస్తామనే ప్రతిపాదన పెట్టారు. కానీ నితీష్.. ఏం నిర్ణయం తీసుకుంటారోననే టెన్షన్ ఉంది. గత ఎన్నికల్లో మూడు సిట్టింగ్ సీట్లు ఉన్న రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి ఒక్క సీటే ఇస్తామని చెప్పడంతో… ఆ పార్టీ అధ్యక్షుడు కుష్వాహా .. ఎన్డీఏ నుంచి వెళ్లిపోయారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కూటమిలో చేరారు. అంటే.. బీజేపీకి మిత్రులూ పోయారు.. సీట్లు పోతున్నాయి. పోటీ చేసిన సీట్లలో రేపు ఎన్ని గెలుస్తారో తెలియదు..! ఓ రంగా.. బీహార్లో బీజేపీ ముందుగానే ఓడిపోయిందన్నమాట..!