భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్న బలమైన మిత్రపక్షం…జేడీయూ. కానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఇప్పుడు బీజేపీని… అదో రకంగా చూస్తున్నారు. కొద్ది రోజుల నుంచి చీదరించుకుంటున్నంత పని చేస్తున్నారు. ఉపఎన్నికల్లో జేడీయూ ఓటమికి బీజేపీనే కారణమని నేరుగా నిందించారు. యోగా డే రోజు… పబ్లిసిటీ కోసం.. ఆసనాలు వేయడమేమిటని… నేరుగా నరేంద్రమోడీకి తగిలేలా.. విమర్శలు కూడా చేశారు. ఇక తరచూ.. ఈ జేడీయూ నేత మళ్లీ ఆర్జేడీతో జట్టుకట్టబోతున్నారని ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఏ ఒక్క బీజేపీ నేత కూడా.. నోరు విప్పలేదు. ఎందుకంటే.. ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షాలు అత్యంత అవసరం. జేడీయూ కూటమి నుంచి వెళ్లిపోతే… పూర్తిగా బీజేపీ చిక్కుల్లో పడిపోతుంది.
నితీష్ కుమార్ చేస్తున్న రాజకీయం అంతా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందడానికేనని బీజేపీ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అందుకే నితీష్‌కుమార్‌ను తానే డీల్ చేయాలని అమిత్ షా డిసైడయ్యారు. సీట్ల విషయంపై చర్చించేందుకు ఆయన పట్నా వెళ్లే సమయంలో.. నితీష్ కుమార్ ఓ బాంబు పేల్చారు. 22 సీట్లు మాత్రమే ఇస్తామని.. ఇష్టమైతే ఉండాలని లేకపోతే లేదని తేల్చి చెప్పేశారు. 2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీతో నితీష్ లేరు. బీజేపీ… రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ లోక్జనశక్తితో పాటు మరికొందర్ని కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించింది. జేడీయూకి ఇప్పుడు రెండు మాత్రమే సిట్టింగ్ సీట్లు ఉన్నాయి. గతంలో.. పొత్తులో ఉన్నప్పుడు బీజేపీ కన్నా జేడీయూనే ఎక్కువ సీట్లలో పోటీ చేసేది.
బీజేపీతో పాటు ఎన్డీఏలో లోక్‌జనశక్తికి ఆరు సిట్టింగ్ సీట్లు, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీకి మూడు సిట్టింగ్ సీట్లు ఉన్నాయి. వీరందరితో పాటు.. జేడీయూ కలసి ఉన్న నలభై సీట్లను పంచుకోవడం అసాధ్యం. అలా పంచుకుంటే.. జేడీయూకి ఐదు సీట్లు మాత్రమే వస్తాయి. అందుకే నితీష్ కుమార్ పక్క చూపులు చూస్తున్నారు. సిట్టింగ్ సీట్లు వదులుకోవడానికి.. ఎన్డీఏలోని ఇతర పార్టీలు అంగీకరించవు. అందుకే.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలసి మరోసారి మహాకూటమిగా మారాలనే ఆలోచనలో బీహార్ పార్టీలు ఉన్నాయి. ఒకప్పుడు రామ్‌విలాస్ పాశ్వాన్.. ఆర్జేడీతో కలిసి పోటీ చేశారు. అందుకే ఇప్పుడు మళ్లీ అదే ప్రచారం ప్రారంభమయింది. పాశ్వార్ అల్లుడు నేరుగా వెళ్లి ఆర్జేడీలో చేరిపోయారు. ఏ విధంగా చూసినా.. బీహార్‌లో ఎన్డీఏ పార్టీలు కలసి పోటీ చేసే అవకాశం లేదు. ఎవరు బయటకు వెళ్తారన్నదే ఆసక్తికరం.