సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో బీహార్ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ముంబైలో సుషాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నప్పటికీ.. తమ పరిధిలో లేనప్పటికీ… సీబీఐ విచారణ జరిపించాలంటూ.. కేంద్రానికి సిఫార్సు చేసింది. సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ బీహార్‌కు చెందినవారు. ఆయన తల్లిదండ్రులు ఇప్పటికీ బీహార్లోనే నివాసం ఉంటారు. పట్నాలో ఆయన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత… సీబీఐ విచారణ చేయించాలంటూ… సీఎంను కోరారు. సుషాంత్ తండ్రి విజ్ఞప్తి మేరకు.. సీఎం నితీష్ కుమార్.. కేంద్రానికి సిఫార్సు చేశారు.
వాస్తవానికి సుషాంత్ సింగ్ హత్య కేసు పూర్తిగా మహారాష్ట్రకు సంబంధించిన విషయం. ఘటన అక్కడే జరిగింది కాబట్టి… వారే విచారణ జరుపుతున్నారు. సుషాంత్ సింగ్ బీహార్ వాసి అయినంత మాత్రాన.. బీహార్ పోలీసులు… బీహార్ ప్రభుత్వం ఇందులో కల్పించుకోవడానికి అధికారం లేదు. అయితే.. రాజకీయ కారణాలో… ఇంకేమైనా ఉన్నాయో కానీ.. బీహార్ ప్రభుత్వం.. సుషాంత్ సింగ్ మృతి కేసులో.. హైపర్ యాక్టివ్‌గా వ్యవహరిస్తోంది. సుషాంత్ తండ్రి ఫిర్యాదు చేయడం ఆలస్యం… కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం ముంబైకి ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపారు. ముంబై పోలీసులు సరిగ్గా విచారించడం లేదని… బాలీవుడ్ మాఫియా అంటూ…బీహార్ డిప్యూటీ సీఎం విమర్శలు ప్రారంభించారు. వీటన్నింటితో… సుషాంత్ ఆత్మహత్య కేసుకు రాజకీయ రంగు పులుముకుంటోంది.
ముంబైలో బీహార్‌కు చెందిన కార్మికులపై గతంలో శివసైనికులు దాడులు చేసేవారు. శివసేన.. పూర్తిగా మహారాష్ట్ర వాదంతో ఉంటుంది. హిందూత్వవాదంతో ఉంటుంది. స్థానిక నినాదంతో ఎదిగింది. ఇప్పుడు శివసేనకు చెందిన ఉద్దవ్ ధాకరేనే సీఎంగా ఉన్నారు. బీహార్‌కు చెందిన సుషాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సహజంగానే… మహారాష్ట్రలో బీహార్ వాసులకు ఇబ్బందులు అనే అంశం తెరపైకి వచ్చింది. బీహార్‌లో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం ఉంది. అందుకే అక్కడి నితీష్ ప్రభుత్వం మరింత రాజకీయం చేయాలని చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే… సుషాంత్ ఆత్మహత్య కేసులును సీబీఐకి ఇవ్వాలంటూ… సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. దానిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు … ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు కదా.. సీబీఐతో విచారణ చేయించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించి పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇప్పుడు బీహార్ సర్కార్ తెర ముందుకు వచ్చింది.