బీహార్ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా మూడు నెలలపైనే సమయం ఉంది. కానీ ఆరు నెలల క్రితం నుంచే అన్ని పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడక ముందే ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడే రెండు సార్లు బీహార్ లో ఎదో పనిపెట్టుకొని వెళ్లి పార్టీ తరపున ప్రచారం చేసి వచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన నిన్న రాష్ట్రానికి రూ. 1.25 లక్షల కోట్లు ఆర్ధిక ప్యాకేజీ ఒకటి, అదికాకుండా రాష్ట్రంలో మౌలికవసతులను అభివృద్ధి కోసం మరో రూ.40, 000 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగిపోయింది.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే మోడీ అంత భారీ నిధులు మంజూరు చేస్తున్నాట్లు ప్రకటించారని, అదే పని ఆయన ప్రధానిగా అధికారం చేప్పట్టిన వెంటనే చేసి ఉంటే ఈ ఏడాదిన్నర కాలంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెంది ఉండేది కదా? అని ఆయన విమర్శించారు. కానీ కేంద్రం అంత భారీగా ముందే నిధులు విడుదల చేసినట్లయితే వాటితో ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్న నితీష్ కుమార్ తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఆ క్రెడిట్ ఆయనకి, ఆయన జేడీయు పార్టీకే దక్కేలా జాగ్రత్తపడతారు తప్ప కేంద్రం ఉదారంగా ఇచ్చిన నిధులతోనే రాష్ట్రాభివృద్ధి చేసామని చెప్పుకోరు. అందుకే కేంద్రప్రభుత్వం ఇంతకాలం నిధులు విడుదల చేయలేదని భావించాల్సి ఉంటుంది.
అదే సూత్రాన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్తింపజేసుకోవచ్చును. ఎందుకంటే ఇంతవరకు కేంద్రప్రభుత్వం నిధులతో రాష్ట్రంలో చేప్పట్టిన అనేక కార్యక్రమాలన్నీ తమవేనన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొంటోంది. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు అభ్యంతరాలు చెప్పుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం ఆ కార్యక్రమాలకి బీజేపీ నేతలని ఆహ్వానించడం లేదు. కనుక ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు మంజూరు అవడంలేదని భావించవచ్చును.
బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తెదేపాయే ఈ విధంగా వ్యవహరిస్తుంటే తమ పార్టీని ఎన్నికలలో సవాలు చేస్తున్న జేడీయు దాని మిత్రపక్షాలను నమ్మి ఇంత సొమ్ము వాటి చేతుల్లో ఎందుకు పెడతారు? పెడితే అది కొరివితో తల గోక్కోన్నట్లే అవుతుంది. కనుకనే బీహార్ ప్రభుత్వం చేతికి ఆ సొమ్ము ఇచ్చే అవకాశమే లేదని భావించవచ్చును. కానీ బీహార్ లో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చక్కగా వర్తింపజేసి చూసుకొనే అవకాశం మాత్రం కలుగుతోంది.
ఆ ప్రకారం చూసుకొంటే రాష్ట్రానికి కూడా వచ్చే ఎన్నికల వరకు అరకొర నిధులు విడుదల చేస్తూ కేంద్రప్రభుత్వం కాలక్షేపం చేస్తుందేమో? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే కేంద్రప్రభుత్వం నిధులతో రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలు, కార్యక్రమాలలో బీజేపీకి కూడా క్రెడిట్ పంచిపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించవలసి ఉంటుంది. కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధులతో చేప్పట్టే ప్రతీ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లయితే ఈ సమస్య కొంతవరకు పరిష్కరింపబడవచ్చును. లేకుంటే మళ్ళీ ఎన్నికల వరకు ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది. కానీ అలాగా చేస్తే బీజేపీ, దానితో జత కట్టిన పాపానికి తెదేపా కూడా వచ్చే ఎన్నికలలో ములగడం తధ్యం.