హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ చావుదెబ్బ తినటం తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న చంద్రులిద్దరికి అనుకూలించే పరిణామమే. మారిన సమీకరణాల నేపథ్యంలో, రాజ్యసభలో మెజారిటీ లేని ఎన్డీఏ ఇకనుంచి బిల్లుల ఆమోదంకోసం టీడీపీ, టీఆర్ఎస్ వంటి ప్రాంతీయపార్టీలపైన ఆధారపడాల్సి వస్తుంది. దీంతో చంద్రులిద్దరికీ కేంద్రంలో ప్రాధాన్యత పెరుగుతుందనటంలో ఎటువంటి సందేహమూ లేదు. మరోవైపు ఈ రెండు రాష్ట్రాలలోనూ పాగా వేయాలని చూస్తున్న బీజేపీ దూకుడు కూడా తగ్గే అవకాశాలున్నాయి.
చంద్రబాబు నాయుడు విషయంలో చూస్తే, అవటానికి తెలుగుదేశం, బీజేపీ మిత్రపక్షాలైనప్పటికీ కేంద్రంలో పనులు చేయించుకోవటానికి బాబు ఢిల్లీచుట్టూ పదిసార్లు తిరగాల్సి వస్తోంది. మొదటి ఎన్డీఏ ప్రభుత్వంలో నాయుడు చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో బాబుకు అలా సాగటంలేదు. అయితే బీహార్ ఫలితాల నేపథ్యంలో మోడి చంద్రబాబుకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. విభజన తర్వాత ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఇది సానుకూల పరిణామం. ఇక ప్రత్యేకహోదా, ప్యాకేజ్ వంటి విషయాలలోకూడా మోడి వైఖరి మారతాయని ఆశించొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖలోకూడా ఫలితాల ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. ఏపీ బీజేపీ నేతల దూకుడు కొంత తగ్గొచ్చు.
ఇక కేసీఆర్ విషయానికొస్తే, ఈ ఫలితాలు చంద్రబాబుకంటే కేసీఆర్‌కే ఎక్కువ అనుకూలించే పరిణామం. తెలంగాణలో బీజేపీని బలమైన శక్తిగా చేయాలని అమిత్ షా, బీజేపీ నాయకత్వం మొదటినుంచీ యోచిస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అంతగా అండదండలు అందించటంలేదు. దీనిపై కొంతకాలంగా టీఆర్ఎస్ కేంద్రంపై విమర్శలుకూడా చేస్తోంది. అయితే మారిన పరిస్థితులు, టీఆర్ఎస్ కేంద్రంనుంచి పనులను డిమాండ్ చేసి చేయించుకునేందుకు మార్గం సుగమంచేశాయని చెప్పొచ్చు.