బీహార్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగిన ఉపఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇవి దేశ రాజకీయాలను సమూలంగా మార్చనున్నాయి. ముఖ్యంగా బీహార్‌లో మోడీ, నితీష్ జంట ఎదురీదుతోంది. అక్కడ ఫలితంగా ఎన్డీఏకు వ్యతిరేకంగా వస్తే బీజేపీ ఎదుగుదుల ఆగిపోయినట్లుగానే భావించాల్సి వస్తుంది. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ- జేడీయూ కూటమి గెలిచాయి. ఇప్పుడు ఆర్జేడీని పక్కకు నెట్టేసి.. జేడీయూ- బీజేపీ కలిసి పోటీ చేశాయి. కానీ ఫలితం ఏమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. పదిహేనేళ్లు సీఎంగా ఉన్న నితీష్‌పై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పాకిస్థాన్, కశ్మీర్, చైనా మాటలు చెప్పే బీజేపీ నేతలకు.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమస్యలపై పెద్దగా స్పందించలేపోయారు. ఫలితంగా ఆ కూటమి తేలిపోయిందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. తేజస్వి సీఎం అయితే దేశ రాజకీయాలు మారడం ఖాయం.
ఇక తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కూడా … తెలంగాణ రాజకీయాల్ని మార్చనుంది. టీఆర్ఎస్ పరిస్థితేమిటన్నది.. తేలిపోతుంది. బీజేపీ ఒక వేళ బలపడితే టీఆర్ఎస్కూ కౌంట్ డౌన్ స్టార్టయినట్లేననని ఇప్పటికే విశ్లేషణలు వస్తున్నాయి. మౌత్ టాక్ బీజేపీ అభ్యర్థికి బలంగా ఉంది. అయితే ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడం ఎక్కడా లేదని.. గెలిచి తీరుతామని గులాబీ నేతలు ధీమాగా ఉన్నారు.
ఇక ఫిరాయింపుల ద్వారా చేజిక్కించుకున్న మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. బీజేపీ 9 స్థానాల్లో గెలుపొందకపోతే.. మొత్తానికే తేడా వస్తుంది. ప్రభుత్వం కూలిపోతుంది. బీహార్‌లో పరాజయం పాలై.. ఇక్కడా తేడా కొడితే.. బీజేపీకి దెబ్బమీద దెబ్బ పడినట్లవుతుంది. చాలా ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి పదిలోపు సీట్లు రావొచ్చని అంచనా వేశాయి. ఇవి కాక.. యూపీ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉపఎన్నికలు జరిగాయి. వాటిలో ఫలితాలు.. దేశ రాజకీయ గమనంలో కీలకమైన మార్పు తీసుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.