మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, సోషల్ నెట్ వర్క్ వచ్చిన తరువాత ఇప్పుడు అందరికీ అదే లోకం అయిపోయింది. అవిలేని జీవితం ఊహించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే అవి రాక పూర్వం ప్రజలు సుఖసంతోషాలతో జీవించలేదా?అంటే ఇంతకంటే చాలా ప్రశాంతమైన జీవనమే సాగించేవారని చెప్పకతప్పదు. ప్రస్తుతం ఇవన్నీ చాలా అత్యవసరమైపోయాయి. ప్రతీ మనిషి జీవితంలో భాగంగా మారిపోయాయి. అవి అందిస్తున్న అదనపు సౌక్యంతో బాటు అదనపు సమస్యలు, ఒత్తిళ్ళు కూడా స్వీకరించక తప్పడం లేదు.
ఒకప్పుడు ఇవన్నీలేని రోజుల్లో ప్రజలు సంగీతం, సాహిత్యం వంటి కళల పట్ల ఆసక్తి చూపేవారు. అలాగే కుటీర పరిశ్రమలు వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తి రంగాలపైనే ప్రజలు, ప్రభుత్వాలు ఎక్కువ దృష్టి పెట్టేవి. వాటి వలన సమాజంలో సమతుల్యం నెలకొని ఉండేది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఎన్ని ఒడిదుడుకులకు లోనవుతున్నపటికీ, ఆ ప్రభావం సామాన్య ప్రజల వరకు చేరేది కాదు. కానీ కంప్యూటర్స్, ఐటి, సాఫ్ట్ వేర్ రంగాలు అభివృద్ధి చెందిన తరువాత ప్రజలకి, ప్రభుత్వాలకి కూడా దేశానికి ఆయువుపట్టు వంటి వ్యవసాయం, ఉత్పత్తి రంగాలపై ఆసక్తి తగ్గి వాటిపై మోజు పెరిగింది.
కంప్యూటర్స్, ఐటి, సాఫ్ట్ వేర్ రంగం ద్వారా దేశంలో లక్షాలాది మంది యువత, వారి కుటుంబాలు ఆర్ధికంగా స్థిరపడగలిగారు. కానీ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో ఎక్కడ ఏ చిన్న కుదుపు వచ్చినా, ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతోంది. ఎంత పైకి ఎదిగినా అభద్రతాభావం వెంటాడుతూనే ఉంటుంది. వ్యవసాయం, ఉత్పత్తి రంగాలని కాదనుకొని కంప్యూటర్స్, ఐటి, సాఫ్ట్ వేర్ రంగాలపై విపరీతమైన మోజు పెంచుకోవడం వలననే ఈ సమస్య తలెత్తుతోందని చెప్పక తప్పదు. అవి మనిషికి ఉపాధి కల్పించగలవేమో కానీ మనిషికి అవసరమైన ఆహారాన్ని, వస్తువులను ఉత్పత్తి చేయలేవని అందరికీ తెలుసు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్ ని స్థాపించిన బిల్ గేట్స్ స్వయంగా దీనిని దృవీకరించడం విశేషం.
“కంప్యూటర్లు అనేక జటిలమైన సమస్యలు పరిష్కరించగలవేమో కానీ ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఆకలిని, పేదరికాన్ని నిర్మూలించలేవు. కనుక ఈ టెక్నాలజీ అభివృద్ధికి కృషి చేయడం కంటే కోడి పిల్లలు పెంచడం చాలా ఉత్తమం. ఇది వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ, వాస్తవిక దృక్పధంతో నిరుపేదల దారిద్యాన్ని, వారి సమస్యలను పరిష్కరించాలంటే ఇదే చాలా సులువైన మార్గమని నేను నమ్ముతున్నాను. వాటితో నిరుపేదలకి అవసరమైన ఆహారం, ఉపాధి కూడా లభిస్తుంది. కోళ్ళ పెంపకం ద్వారా వారి సమస్యలను కూడా అధిగమించే అవకాశం కలుగుతుంది. అందుకే మా సంస్థ ద్వారా ఆఫ్రికాలో నిరుపేదలకి లక్ష కోడిపిల్లలని సరఫరా చేస్తున్నాము,” అని చెప్పారు.
తన మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా యావత్ ప్రపంచంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపిన బిల్ గేట్స్, ఇప్పుడు యుగయుగాలుగా భారతదేశం అవలంభిస్తున్న విధానమే సరైనదని మళ్ళీ కనుగొనడం విశేషం. కనుక ప్రభుత్వాలు, ప్రజలు కూడా వ్యవసాయం, ఉత్పత్తి రంగాలపై మళ్ళీ దృష్టి సారించవలసిన అవసరం ఉంది.