వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. వర్షాలు పడటానికి ఓ ప్రత్యేకమైన ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం పేరు మేఘమథనం. అంటే.. విమానాల్లో మేఘాలపైకి వెళ్లి .. రసాయనాలు చల్లి.. మేఘాలనను వర్షించేలా చేయడం. దీనిపై అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చాయి. సంబంధింత మంత్రిగా రఘువీరారెడ్డి… మేఘ మథనం మంచి ఫలితాలు ఇచ్చిందని చెప్పుకున్నారు. వైఎస్ హయాం తర్వాత ఆ మేఘమథనాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ… అప్పట్లో ఈ మేఘమథనం కోసం ఇచ్చిన కాంట్రాక్ట్‌కు ఇప్పటి వరకూ డబ్బులు చెల్లించలేదు. ఆ విషయాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించేవరకూ బయటకు రాలేదు. వడ్డీతో సహా నలభై కోట్లకుపైగా ఉన్న బకాయిల్ని… రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 నుంచి 2009 వరకు జరిగిన మేఘమథనంకు అగ్ని ఏవియేషన్ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రభుత్వం చెప్పినట్లుగా ఆ సంస్థ మేఘమథనం చేసింది. వర్షాలు పడ్డాయా..? పడితే మేఘమథనం వల్లనే పడ్డాయా.. అన్నదానిపై ఎవరూ పరిశీలన జరపలేదు. అయితే… ఆ మేఘ మథనంకి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లింపులు జరపలేదు. దాదాపుగా రూ. 40 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ సంస్థ అప్పటి నుంచి ప్రభుత్వాలకు లేఖలు రాస్తూనే ఉంది. కానీ ఇవ్వలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆ బకాయిలు ఎవరు చెల్లించాలన్నదానిపై స్పష్టత రాలేదు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో అగ్ని ఏవియేషన్ 2016లో హైకోర్టులో దావా వేసింది. విచారణ జరిపిన హైకోర్టు.. ప్రజల నిష్పత్తిలో రెండురాష్ట్రాల ప్రభుత్వాలు బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. ఈ లెక్క ప్రకారం ఏపీ సర్కార్ 52 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
అగ్ని ఏవియేషన్ సంస్థ మేఘ మథనాన్ని తెలంగాణలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండజిల్లాలో నిర్వహించి. ఏపీలో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోనిర్వహించింది. జిల్లాల వారీగా కాకుండా.. జనాభా వారీగా చెల్లించాలని ఆదేశించడంతో.. తెలంగాణ సర్కార్‌కు రూ. 20 కోట్ల వరకూ భారం పడనుంది. వైఎస్ హయాం తర్వాత మరెవరూ.. మేఘమథనం గురించి ఆలోచన చేయలేదు.