విజయమో, వైఫల్యమో – ఏదీ పట్టించుకోకుండా ప్రయోగాల చేస్తూనే వెళ్తుంటాడు కల్యాణ్ రామ్. కొత్త కథల్ని తెరకెక్కించడం అంటే తనకు భలే సరదా. `బింబిసార` కూడా అలాంటి ప్రయత్నమే. వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కల్యాణ్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. ఇదో సోషియో ఫాంటసీ అని, రకరకాల జోనర్లు ఈ కథలో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు టీజర్ చూసినా అదే అనిపిస్తోంది.
”ఓ సమూహం తాలుకూ ధైర్యాన్ని ఓ ఖడ్గం శాశిస్తే..
కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవొంచి బానిసలైతే
ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది
అదే త్రిగడ్తల రాజ్యపు నెత్తుటి సంతకం – బింబిసారుడి ఏక ఛాత్రాధిపత్యం”
– అనే డైలాగ్ ఈ టీజర్లో వినిపించింది. కల్యాణ్ రామ్ కత్తి పట్టుకుని చేసే విన్యాసాలు – మగధీర, బాహుబలి సినిమాల్ని గుర్తు చేసేలా ఉన్నాయి. కల్యాణ్ రామ్ క్యారెక్టర్లో నెగిటీవ్ ఛాయలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా కత్తి – డాలు టైపు కథ కాదని, చివర్లో ఇచ్చినకల్యాణ్ రామ్ రెండో ఎంట్రీ చెబుతోంది. కథలో రెండు కోణాలున్నాయన్న హింట్ చివర్లో ఇచ్చారు. మరి అప్పటి బింబిసారుడికీ, ఇప్పటి కథానాయకుడికీ ఉన్న సంబంధం ఏమిటో తెరపైనే చూడాలి. మొత్తానికి.. టీజర్‌తో ఆసక్తిని రేకెత్తించాడు కల్యాణ్ రామ్. ఈ తరహా కథలకు ఇప్పుడు పాన్ ఇండియా స్కోప్ ఉంది. మార్కెట్ పరంగానూ వెసులుబాటులున్నాయి. అందుకే కల్యాణ్ రామ్ కూడా బాగానే ఖర్చు పెట్టినట్టు తోస్తోంది.