ఎవరూ ఊహించలేనంత పెద్ద విజయాన్ని నమోదు చేసింది బింబిసార. కల్యాణ్ రామ్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అందరి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజయంతో.. పార్ట్ 2పై నమ్మకాలు మరింత పెరిగాయి. దాంతో పాటు బడ్జెట్ కూడా. కొత్త దర్శకుడు కాబట్టి… బింబిసార 1 విషయంలో బడ్జెట్ పరిమితమైపోయింది. ఇప్పుడు వశిష్ట్ పై గురి కుదిరింది. బింబిసార ని మించిపోయే బడ్జెట్ పార్ట్ 2కి ఇవ్వబోతున్నాడు కల్యాణ్ రామ్. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో దిల్ రాజు కూడా ఎంటర్ అవ్వబోతున్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్.
బింబిసార విజయం దిల్ రాజుని చాలా ఇన్స్పైర్ చేసింది. పరిమిత బడ్జెట్ లో క్వాలిటీ సినిమా ఇవ్వడం ఆయనకు నచ్చింది. ఇంకొంచెం బడ్జెట్ ఇస్తే బింబిసార 2 ని మరో స్థాయిలో తీస్తారన్న నమ్మకం కలిగింది. బింబిసార సక్సెస్ మీట్ లో దర్శకుడు విశిష్ట్ నీ, ఈ చిత్రబృందాన్నీ దిల్ రాజు ఆకాశానికి ఎత్తేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ యేడాది అసలు సిసలైన హిట్ ఇదేనని దిల్ రాజు డంకా బనాయించి మరీ చెప్పారు. ఎందుకంటే ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు? ఎంత రాబడి వచ్చింది? అనే లెక్కలు ఆయనకు బాగా తెలుసు. పార్ట్ 2లోనూ చాలా స్టామినా ఉందని ఆయన ముందే గ్రహించారు. అందుకే.. ఈ సినిమా నిర్మాణంలో చేయి కలపడానికి దిల్ రాజు రెడీగా ఉన్నారు. దిల్ రాజు వస్తే.. ఈ సినిమాకి బడ్జెట్ విషయంలో వెసులు బాటు వస్తుంది. కాబట్టి.. కల్యాణ్ రామ్ కూడా సముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. బింబిసార 2 కథ ఇంకా లాక్ అవ్వలేదు. కథ ఫైనల్ అయితే, ఎంత ఖర్చు పెట్టాలి? అనే విషయంలో క్లారిటీ వస్తుంది. అదొచ్చాక.. దిల్ రాజుని టీమ్ లో తీసుకోవాలా? లేదంటే… సింగిల్ గానే ప్రొడ్యూస్ చేయాలా? అనే విషయంలో కల్యాణ్ రామ్ ఓ నిర్ణయానికి వస్తారు. ఇప్పటికైతే దిల్ రాజు నుంచి మాత్రం ఆఫర్ రెడీగా ఉంది.