బీజింగ్ ఒలింపిక్స్ లో అనూహ్యంగా స్వర్ణ పతకం సాధించిన హీరో అభినవ్ బింద్రా రియోలో మాత్రం ఫెయిలయ్యాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆనాడు అతడు బంగారు పతకం సాధించినప్పుడు దేశం పులకించి పోయింది. భారత దేశ చరిత్రలో తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం నెగ్గిన వీరుడిగా బింద్రా జేజేలు అందుకున్నాడు. లండన్ లో మాత్రం మెరుపులు మెరిపించలేదు.
రియోలో కచ్చితంగా పతకం గెలుస్తారని భారతీయులు ఆశించిన వారిలో అభినవ్ ఒకడు. ఏదో ఒక పతకంతో తన కెరీర్ ముగించాలని బింద్రా కూడా భావించాడు. గట్టి పట్టుదలతో సాధన చేశాడు. సోమవారం రాత్రి ప్రిలిమినరీ రౌండ్ లో నెగ్గి మరిన్ని ఆశలు రేకెత్తించాడు. ఫైనల్ రౌండ్ లో హోరాహోరీగా పోటీ పడ్డాడు. చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పాపం… పాలిపోయిన ముఖంతో బింద్రా పోటీ నుంచి తప్పుకున్నాడు. మరో భారతీయుడు గగన్ నారంగ్ ఫైనల్ రౌండ్ కు క్వాలిఫై కాలేదు.
ఈనెల 5న ఒలింపిక్స్ మొదలయ్యాయి. పతకాల వేట ఆ మర్నాడు ఆరంభమైంది. మూడోరోజు వరకూ భారత్ బోణీ కొట్టలేదు. మన దేశం తరఫున మొదటి పతకం గెలిచేది ఎవరా అని 120 కోట్ల మంది భారతీయులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బింద్రాపైనే భారీగానే అంచనాలున్నాయి. పాపం చివరి క్షణం వరకూ గట్టి పోటీ ఇచ్చినా, కొద్దిపాటి తేడాతో వైదొలగాల్సి వచ్చింది.
పురుషుల హాకీలోనూ ఓ చేదుకబురు. జర్మనీతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. క్రితం సారి స్వర్ణ పతక విజేత జర్మనీ జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. ఓడినా గట్టి పోటీ ఇచ్చిందనే పేరు మాత్రం మనోళ్లకు మిగిలింది. ఈ మ్యాచ్ నెగ్గి మనోళ్లు క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకుంటారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది.