ఈనెల 10న నందమూరి బాలకృష్ణ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ పుట్టిన రోజు ఓ ప్రత్యేకత ఉంది. ఇది ఆయన 60వ జన్మదినం. అంటే షష్టి పూర్తి అన్నమాట. ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానులకు ఓ కానుక ఇవ్వబోతున్నారు. తాను స్వయంగా పాడిన ఓ పాటని ఆ రోజున విడుదల చేయబోతున్నారు. `పైసా వసూల్`లో బాలయ్య పాట పాడిన సంగతి తెలిసిందే. హుద్ హుద్ బాధితులకు అండగా `మేమే సైతం` కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు కూడా బాలయ్య ఓ పాట పాడి అభిమానుల్ని అలరించారు. ఇప్పుడు మరో పాటందుకున్నారు. అయితే ఇది ప్రైవేటు గీతం. అభిమానుల్ని అలరించడం కోసం బాలయ్య చేసిన ఓ ప్రయత్నం.
అయితే ఈ సందర్భంగా ‘నిన్న తప్పు చేసినవాళ్లని నిలదీసింది ఆ గళం.. ఇప్పుడు ఆబాలగోపాలాన్ని అలరించడానికి పాట పాడింది అదే గళం’ అంటూ ఓ పోస్టర్ విడుదల చేసింది. చిత్రసీమ ప్రభుత్వంతో జరిపిన మీటింగులపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ‘తప్పు చేసినవాళ్లని నిలదీసిన ఆగళం’ అనడం వెనుక అర్థం అదే. చూస్తుంటే.. మిగిలిన వాళ్లు వదిలేసినా, బాలయ్య, ఆయన ఫ్యాన్సూ, పీఆర్ టీమూ మాత్రం ఈ వివాదాన్ని వదిలేట్టు కనిపించడం లేదు.