పూరి జగన్నాథ్.. తెలుగు సినిమాలో హీరోయిజాన్ని ఎలివేట్ చేసి, వాళ్లని హిమాలయ శిఖరాన చేర్చిన అతి కొద్దిమంది దర్శకుల్లో ఒకరు. బద్రి, ఇడియట్, అమ్మా – నాన్న తమిళ అమ్మాయి, పోకిరి… ఇవన్నీ పూరి నుంచి వచ్చిన మైల్ స్టోన్ సినిమాలు. ఓ దశలో ప్రతీ స్టార్ హీరో.. ‘పూరి సినిమాల్లో ఒక్కసారైనా చేయాలి’ అని గట్టిగా అనుకొనేవాడు. పూరి పిలుపు కోసం ఎదురుచూసేవాళ్లు. రోజుల్లో కథ రాయడం, నెలల్లోనే సినిమా తీయడం, ఒక సినిమా అయ్యాక వెంటనే మరో సినిమా పనిలో పడిపోవడం ఇదంతా పూరి స్టైల్. అయితే పూరిలో ఆ వేగం తగ్గింది. ఆ ఛార్మ్ పోయింది. వరుసగా ఫ్లాపులు ఇస్తూ వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ తో పూరి లైన్లో పడ్డాడనుకొన్నారంతా. కానీ ‘డబుల్ ఇస్మార్ట్’తో ఆ నమ్మకాలు పూర్తిగా సడలిపోయాయి. మరి పూరి ఇప్పుడేం చేస్తున్నాడు? ఏం చేయాలి?
ఈరోజు పూరి పుట్టినరోజు. మామూలుగా ఆయతే ఆయన కొత్త సినిమా కబుర్లు వినిపించాల్సిన రోజు. కానీ.. పూరి నుంచి కొత్త సంగతులేం బయటకు రాలేదు. ఆయన ఇంకా ‘డబుల్ ఇస్మార్ట్’ భారాన్నే తన భుజాలపై మోస్తున్నాడు. పూరిలో ప్రతిభ గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. తను మంచి టెక్నీషియన్. మంచి రైటర్. కాకపోతే… పూరి ఇప్పుడు మూసలోంచి బయటకు రావాలి. పూరి రాతలతో తెలుగు సినిమా శైలి మారింది. పూరిని చూసి కథలు రాసుకోవడం మొదలెట్టారు. అయితే ఆ జమానా మారిపోయింది. సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. హీరోయిజానికి అర్థం మారిపోయింది. క్యారెక్టరైజేషన్లు కొత్త దారులు వెదుక్కొంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు పూరి తన దారి విడచి, కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టాలి. పూరి మంచి రైటర్. తనలోని కథకుడికి పదును పెట్టేలా తన సినిమాలుండాలి. ‘బద్రి’లో తన హీరోయిజం, తన మార్క్ డైలాగులతో ఎలా షేక్ చేశాడో… అలానే ఇప్పుడూ ఓ కొత్త పంథాని చూపించాలి. ప్రేక్షకులకు షాక్ ఇవ్వాలి. ‘ఇది పూరి సినిమాలా లేదే..’ అనుకోవడమే వాళ్లకు పూరి ఇవ్వగలిగే సర్ప్రైజ్.
పూరి లాంటి దర్శకుడికి హిట్ పడాలి. ఎందుకంటే.. తను సంపాదించినా, పోగొట్టుకొన్నా అది సినిమాల్లోనే, సినిమాలతోనే. పూరి హిట్ కొడితే… ఆ రేంజ్ మామూలుగా ఉండదు. తన నుంచి టప టప సినిమాలొస్తాయి. నిర్మాతగానూ కొత్త టాలెంట్ ని ప్రొత్సహిస్తాడు. తన దగ్గరున్న కొత్త కథలకు తలుపులు తెరచుకొంటాయి. అందుకే పూరి నుంచి ఓ మంచి హిట్ కోసం చిత్రసీమ ఆశగా ఎదురు చూస్తోంది. పూరిలో మార్పు తదుపరి సినిమాతోనైనా వస్తుందని ఆశిస్తుంది. ఇక కొత్తగా ఆలోచించాల్సింది పూరీనే. ఎనీవే.. హ్యాపీ బర్త్ డే టూ..పూరి.