తెలంగాణ ఉద్యమంలో ఊరూరూ తిరిగి పాటలతో ప్రజల్ని చైతన్యం చేసిన కళాకారుడు రసమయి బాలకిషన్. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని తెలంగాణ సాంస్కృతిక శాఖ సారధిగా నియమించారు. అంతే కాదు… రసమయి బాలకిషన్ దర్శకుడు కూడా. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ‘జై తెలంగాణ’ సినిమా తీశారు. వీరులకు మరణం లేదు.. అనేది ఉపశీర్షిక. కథ, కథనం, మాటలు, నిర్మాణం, దర్శకత్వం… అన్నీ ఆయనే. చాలారోజుల తర్వాత మళ్ళీ రసమయి బాలకిషన్ మరో సినిమా తీస్తున్నారు. అందులో టీవీ ద్వారా ఫేమస్ అయిన బిత్తిరి సత్తి హీరో. పలువురు తెలంగాణ నటులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ‘తుపాకీ రాముడు’ని వర్కింగ్ టైటిల్ గా నిర్ణయించారు. అదే టైటిల్ గా ఫైనల్ కావొచ్చు. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అన్నీ రసమయి బాలకిషనే. జూన్ 2న సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు.