టీవీ9 ఇస్మార్ట్ న్యూస్‌ను తన భుజాలపై నడిపిస్తున్న బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ఆ చానల్ నుంచి వైదొలిగారు. ఆయనను.. టీవీ9 యాజమాన్యమే తొలగించిందని చెబుతున్నారు. వీ6 చానల్లో తీన్మార్ న్యూస్ ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి వచ్చిన బిత్తిరి సత్తి.. చాలా కాలం పాటు ఆ కార్యక్రమాన్ని యాంకర్ శివజ్యోతికి కలిసి నిర్వహించారు. తీన్మార్ న్యూస్ అంటే.. బిత్తిరి సత్తి, శివజ్యోతి అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. వీ6 నుంచి వారు వివిధ కారణాలతో బయటకు వచ్చారు. శివజ్యోతి బిగ్ బాస్ షోకి వెళ్లగా.. బిత్తిరి సత్తి.. టీవీ9లో చేరారు. యాజమాన్యం మారిన తర్వాత టీవీ9కి మేకోవర్ ఇవ్వాలనుకున్న కొత్త టీం.. ఇస్మార్ట్ న్యూస్‌కు రూపకల్పన చేసింది. నేరుగా.. బిత్తిరి సత్తినే చేర్చుకోవడంతో.. ఆ ప్రోగ్రాం నిలబడుతుందని అనుకున్నారు.
తర్వాత శివజ్యోతిని కూడా చేర్చుకున్నారు. దాంతో.. తీన్మార్ న్యూస్ కన్నా.. ఇస్మార్ట్ న్యూస్ సక్సెస్ అవుతుందని అనుకున్నారు. కానీ తీన్మార్ న్యూస్‌ని బీట్ చేయలేకపోయింది. అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడానికి తోడు.. ప్రోగ్రామ్స్‌లో సొంత అజెండాను అమలు చేస్తున్నారన్న అభిప్రాయం… యాజమాన్యానికి వచ్చిందంటున్నారు. కంపెనీకి సంబంధం లేకుండా.. ఇతర ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేశారన్న కోపం.. యాజమాన్యంలో ఉందంటున్నారు. అదే సమయంలో.. ఫాదర్స్ డే రోజు.. బిత్తిరి సత్తి నిజంగా తన తండ్రి ఫోటోనే ఉపయోగించి స్కిట్ చేశారు. అది కూడా.. టీవీ9 యాజమాన్యానికి ఆగ్రహం తెప్పించిందంటున్నారు. అందుకే.. బయటకు పంపేశారని చెబుతున్నారు.
ఇది కాదు.. అసలు టీవీ9 కొత్త యాజమాన్యం తీరే భిన్నంగా ఉంటుందని… మొదట్లో భారీ జీతాలతో నియమించుకున్న వారిని ఇప్పుడిప్పుడే బయటకు పంపే ప్రయత్నం చేస్తోందని అంతర్గతంగా చర్చ జరుగుతోంది. బిత్తిరి సత్తి ఒక్క ప్రోగ్రామే చేస్తారు. ఇస్మార్ట్ న్యూస్ టీం బడ్జెట్‌కి… వస్తున్న రేటింగ్స్‌కు పొంతన ఉండటం లేదు. అందుకే..అన్ని రకాల అంచనాలు వేసుకుని… బిత్తిరి సత్తితో స్టార్ట్ చేశారని.. ముందు ముందు ఇంకా కొంత మంది ముఖ్యులకూ… డోర్ చూపిస్తారని చెబుతున్నారు. టీవీ9 కొత్త యాజమాన్యం వ్యాపార వ్యూహాల గురించి తెలిసిన వారు ఇది నిజం కావొచ్చని కూడా అంటున్నారు. మొత్తానికి బిత్తిరి సత్తి.. టీవీ9లో తన బ్రాండ్ చూపించకుండానే.. బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది.