బీజేపీ నేతలు పదే పదే చలో అంతర్వేదికి ఎందుకు పిలుపునిస్తున్నారు. పోలీసులు కూడా అంతే వేగంగా వారిని ఇళ్లలోనే అడ్డుకుంటున్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన జరిగినప్పుడు.. ఓ సారి చలో అంతర్వేదికి పిలుపునిచ్చారు . ఉదయం పూట బీజేపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విమర్శలు రావడంతో సాయంత్రం అందర్నీ రథం దగ్గరకు అనుమతించారు. సోము వీర్రాజు రథాన్ని పరిశీలించి … ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే అనూహ్యంగా.. మళ్లీ చలో అంతర్వేది అంటూ..కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గతంలో మంత్రులు, ఇతరులు రథాన్ని పరిశీలించడానికి వెళ్లినప్పుడు గొడవలు జరిగాయి. ఓ చర్చిపై రాళ్లేశారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నేతల చలో అంతర్వేది కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
గురువారం బీజేపీ నేతలు.. బయలుదేరక ముందే ఇళ్లవద్ద అరెస్ట్ చేశారు. దాంతో ఎవరూ బయటకు రాలేదు. అయితే పట్టువదలని సోమువీర్రాజు ఆరు నూరైనా శుక్రవారం చలో అంతర్వేది నిర్వహిస్తామని సవాల్ చేశారు. అయితే.. శుక్రవారం కూడా పోలీసులు అందర్నీ ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదు. దాంతో చలో అంతర్వేదిలో చలో కాకుండానే కార్యక్రమం ముగిసిపోయింది. అయితే..బీజేపీ నేతల అరెస్ట్‌పై ఢిల్లీలో ఉండే జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్‌లకు మండిపోయింది. హుటాహుటిన కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు.
ఏపీ ప్రభుత్వం మతపరంగా వ్యవహరిస్తోందని.. రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేసేలా ఆదేశాలివ్వాలని లేఖలో అమిత్ షాని జీవీఎల్ కోరారు. రాష్ట్ర పరిణామాలపై జోక్యం చేసుకోవాలని అమిత్ షాను కోరామని చెప్పుకొచ్చారు.
హైకోర్టు మొట్టికాయలు వేసినా పోలీసుల తీరు మారట్లేదని ..వైసీపీ అధికారంలోకి వచ్చాక..అన్యమత ప్రచారం పెరిగిందని సీఎం రమేష్ ఆరోపించారు. అయితే బీజేపీ నేతలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా… ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా… అంతా ఫ్రెండ్లీ మ్యాచ్‌గానే చూస్తున్నారు తప్ప సీరియస్‌గా తీసుకోవడం లేదు. దాంతో బీజేపీ నేతలకు పెద్దగా మైలేజీ రావడం లేదన్న అభిప్రాయం ఏర్పడుతోంది.