తెలంగాణ భాజపా నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకునే ముందు, మున్సిపల్ ఎన్నికలకి వెళ్లే ముందు ఆ పార్టీ ఏం చెప్పిందో ఒక్కసారి గుర్తుచేసుకోవాలండోయ్! పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు ఎంపీలు గెలిచాం, ఇప్పుడు మున్సిపాలిటీల్లో జెండా ఎగరేస్తున్నాం, తెరాసకు ప్రత్యామ్నాయం మేమేనని తేలిపోతుందంటూ ప్రచారం చేశారు కదా! ఈ లెక్కన ఫలితాలపై ఆ పార్టీకి భారీ ఎత్తునే ఆశలుండాలి. అయితే, ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు వివేక్ ఏమంటున్నారంటే… ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దన్నారు! ఆ మాట సొంత పార్టీ కేడర్ తో ఆయన చెప్పారు.
ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు భాజపా తరఫున ఇంతమంది అభ్యర్థులు ముందుకొస్తారని ముందుగా ఊహించలేదన్నారు వివేక్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాలకు ఓ ఆలోచన ఉందనీ… 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో మనం అధికారంలోకి రావాలని వారు కోరుకుంటున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల్లో ఏమొస్తాయో, ఏం రావో వాటిపై మనం చూడొద్దన్నారు. భాజపాని ఈరోజున ఏ రకంగానైతే ఒక గట్టి స్థాయికి తీసుకొచ్చామో, దాన్ని ఇంకా పైఎత్తులకు తీసుకెళ్లే నిర్ణయం తీసుకోవాలన్నారు. మరో మూడేళ్లపాటు పార్టీ కేడర్ కష్టపడాలనీ, తాను సవాల్ చేసి చెబుతున్నా 2024లో మనమే అధికారంలోకి వస్తున్నామన్నారు!
ఒక పార్టీ బలపడుతోందీ అంటే ఆ పార్టీకి వరుసగా వచ్చే ఎన్నికల్లో దక్కే స్థానాలే ఆ బలానికి కొలమానాలు అవుతాయి. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భాజపాకి తెలంగాణలో అత్యంత కీలకం కాబోతున్నాయి. ఇన్నాళ్లూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నట్టుగా… ద్వితీయ ప్రత్యామ్నాయ పార్టీ అనే స్థాయికి భాజపా వచ్చిందా లేదా అనేది ఈ ఫలితాలు తేల్చేస్తాయి. ఆ నమ్మకంతోనే భాజపా ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే, వివేక్ మాటలు చూస్తుంటే… సమీప భవిష్యత్తులో పార్టీ కేడర్ కు రాబోయే నైరాశ్యం స్థాయిని ముందస్తుగా తగ్గించే ప్రయత్నంగా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఎన్నికల కోసం కార్యకర్తలు రాత్రింబవళ్లూ కష్టపడి పనిచేస్తే…. ఫలితాలు పట్టించుకోవద్దు అని వ్యాఖ్యానిస్తే ఎలా అర్థం చేసుకోవాలి? ఓపక్క ఫలితాలు పట్టించుకోవద్దంటూనే… 2024లో మనం అధికారంలోకి రావాలంటూ కేడర్ కి పిలుపునిస్తే గందరగోళంగా అనిపించడం లేదా..? అనుకున్న కంటే ఎక్కువ మంది అభ్యర్థులు భాజపా తరఫున పోటీకి ముందుకు రావడమే విజయం అంటుంటే.. కార్యకర్తలకి ఏ రకమైన సందేశం ఇస్తున్నట్టు?