హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వంపై మిత్రపక్షమైన భారతీయ జనతాపార్టీ మళ్ళీ విమర్శలు చేసింది. ఏపీలో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవుగానీ, మార్కెట్లో పప్పుల ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయని ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధరల పెరుగుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజిలెన్స్ వేయాలని డిమాండ్ చేశారు. రైతులకోసం ఉద్యమించటానికి బీజేపీ సిద్ధమని, మార్చి 6 తర్వాత దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఉద్యమం చేస్తామని చెప్పారు.
మార్చి 6న రాజమండ్రిలో బీజేపీ బహిరంగసభ ఉంటుందని తెలిపారు. ఏపీకి బీజేపీ ఏమి చేసిందో చెప్పటానికి బీజేపీ సంకల్ప సభ పేరుతో దీనిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దీనికి హాజరవుతారని చెప్పారు. భారత వ్యతిరేకులు పాకిస్తాన్ వెళ్ళిపోవాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులను జనం అసహ్యించుకుంటున్నారని, నాన్ వెజ్ మానేయటంతో సీపీఐ నారాయణకు మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వీర్రాజు కోరారు. గుంటూరులో అగ్రిగోల్డ్‌కు అనేక భూములు ఉన్నాయని వీర్రాజు చెప్పారు.