ఉమ్మడి ప్రాజెక్ట్ విషయంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు భారతీయ జనతా పార్టీ రెడ్ కార్డ్ చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. గోదావరి – కృష్ణా అనుసంధానం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు… ప్రధానమంత్రి నరేంద్రమోదీని విడివిడిగా..రెండు రోజుల వ్యవధిలో కలుస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు గళమెత్తారు. కొంత మంది నేతల్ని.. బీజేపీలో చేర్పించేందుకు ఢిల్లీ తీసుకెళ్లిన ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్… కేసీఆర్, జగన్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ, తెలంగాణ కలిసి ఉమ్మడి ప్రాజెక్టులు ఎలా కడతాయని ప్రశ్నించారు. లక్ష కోట్ల ప్రాజెక్టు పేరుతో కాంట్రాక్టులు, కమీషన్లు దండుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు.
తెలంగాణ నీటిని ఏపీ దోపిడీ చేసిందని ఆరోపించిన కేసీఆర్ ఇపుడు జగన్తో కలిసి ప్రాజెక్టు ఎలా కడతారని లక్ష్మణ్ లాజిక్ తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నీటిని దోపిడీ చేసిందని.. కేసీఆర్ ఉద్యమంలో చెప్పారని లక్ష్మణ్ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు.. తెలంగాణ భూభాగం మీద నుంచి ఏపీకి నీటిని ఎలా తరలిస్తారని.. లక్ష్మణ్ సూటిగా ప్రశ్నించారు. రేపు మోదీతో భేటీలో ఏపీ తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు అంశాన్నీ కేసీఆర్ ప్రస్తావించనున్నారు. ఆర్థికసాయాన్ని కోరనున్నారు. ఐదో తేదీన జగన్మోహన్ రెడ్డి కూడా.. మోదీతో భేటీ అయి..ఇదే అంశంపై సాయం చేయాలనే కోణంలో విజ్ఞప్తి చేయనున్నారు. అయితే అనూహ్యంగా.. బీజేపీ నేతల నుంచి… ఈ ప్రతిపాదనలకు..వ్యతిరేకత వస్తోంది. ఇది తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల్లో చర్చనీయాంశం అవుతోంది.
గోదావరి నీటిని ..శ్రీశైలంకు తీసుకెళ్లేందుకు..తెలంగాణ భూభాగం మీద ప్రాజెక్ట్ కట్టే కసరత్తును..గత నాలుగు నెలలుగా.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలు కూడా రెడీ అయ్యాయి. అయితే..వారిని నిధుల సమస్య వెంటాడుతోంది. రెండు రాష్ట్రాలూ.. అప్పుల ఊబిలో ఉన్నాయి. కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. అందుకే.. కేంద్ర సాయాన్ని కోరాలనుకుంటున్నారు. నదుల అనుసంధానం మీద కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రచారం జరుగుతున్న సమయంలో తమ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని.. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుకున్నారు. కానీ… బీజేపీ వైపు నుంచి మాత్రం వ్యతిరేక స్పందన వస్తుంది. అధికారికంగా కూడా.. అలాంటి స్పందనే వస్తుందన్న అంచనాలు.. ఢిల్లీలో ఇప్పటికే వినిపిస్తున్నాయి.