నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష..! .. అని పెద్దలు ఊరకే అనలేదు. తాడి తన్నేవాడు ఒకడుంటే.. వాటిని చూసి.. వాడి తలనే తన్నేవారు రాజకీయాల్లో ఉంటారు. కానీ పరాజయ ఎదురయ్యే వరకు తన కంటే ఎవరూ ఉండరని అనుకుంటారు. అప్పుడే వారి పతనం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను చూస్తే అదే అనిపించక మానదు. తెలంగాణ ప్రాంత సెంటిమెంట్‌ను పుట్టించి.. రగిలించి.. పతాక స్థాయికి తీసుకెళ్లి… తన జీవితంలో అనూహ్యమైన రాజకీయ ఉన్నత స్థానాలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొందారు. ఇప్పుడు అదే తరహా సెంటిమెంట్‌ను ప్రయోగిస్తూ బీజేపీ శరవేగంగా తెర మీదకు వచ్చింది. కేసీఆర్‌ది ప్రాంతం పాచిక అయితే.. బీజేపీది మతం. కేసీఆర్ వ్యూహాలు ఫలించి ప్రాంతం సెంటిమెంట్ రగిలితే… ఇప్పుడు ఆయన వ్యూహాలు వికటించి మతం సెంటిమెంట్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది.
సెంటిమెంట్‌ను సెంటిమెంట్‌తోనే ఎదుర్కొంటున్న బీజేపీ..!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను కళ్లు మూసి తెరిచే లోపు ముగించేయాలని టీఆర్ఎస్ అనుకుంది. కానీ.. ఇప్పుడు.. ఆ షెడ్యూలే ఇంత సుదీర్ఘంగా ఉందా అనిపించేలా మారిపోయింది. భారతీయ జనతా పార్టీ నేతలు రోజు రోజుకు వ్యూహాల్ని మార్చేసుకుంటున్నారు. హైదరాబాద్ ప్రజల్లో నిద్రాణంగా ఉన్న ఓ సెంటిమెంట్‌ను మేల్కొలుపుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ దగ్గర్నుంచి కూల్చివేతల వరకూ దేన్ని వదలడం లేదు. ఫలితంగా ఇప్పుడు.. జై తెలంగాణ నినాదం ఎక్కడా వినిపించడం లేదు. బహిరంగంగా కాకపోయినా… చాలా మంది మనసులో జై హిందూ నినాదం వినిపిస్తోంది. దీనికి కారణం బీజేపీ.. ఈ విషయంలో పైచేయి సాధించడం. ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం. అంత మాత్రమే కాదు… ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత… ప్రత్యామ్నాయం కోసం వారి ఎదురు చూపులు ఫలించడం కూడా కారణం కావొచ్చు.
తెలంగాణ అంటే టీఆర్ఎస్.. హిందూ అంటే బీజేపీ..!
నిన్నటిదాకా జై తెలంగాణ అంటే.. టీఆర్ఎస్ నినాదంలా ఉండేది. తెలంగాణ కోసం టీఆర్ఎస్కు మద్దతివ్వాలన్నంతగా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఉండేది. ఎవరైనా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై తెలంగాణ వ్యతిరేకుల ముద్ర వేసేవారు. కొన్ని పార్టీల్ని అలాగే తరిమేశారు. ఆయా పార్టీల్లోని నేతలందర్నీ కలిపేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోని నేతల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని ఆ పార్టీని కూడా సెంటిమెంట్‌తో దెబ్బకొట్టారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్కు మద్దతివ్వాలన్నట్లుగా పరిస్థితి ఉండేది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మార్చేసిందని అనుకోవాలి. ఇప్పుడు.. తెలంగాణ సెంటిమెంట్ పాతబడిపోయింది. ఇప్పుడు హిందూ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. మామూలుగానే తెలంగాణలో ముస్లింజనాభా ఎక్కువ. చారిత్రకంగా కూడా.. వారి విషయంమలో వ్యతిరేకత ఉంది. అలాంటి పరిస్థితిని బీజేపీ ఎప్పుడో ఓట్లు చేసుకోవాల్సింది. కానీ ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు.. జాతీయ రాజకీయ అవసరాల కోసం కామ్‌గా ఉంటూ వచ్చింది. ఇప్పుడు.. అన్నింటినీ వదిలేసింది కాబట్టి.. హైదరాబాద్‌లో ఉన్నా… అదో ప్రత్యేకమైన ప్రాంతంగా పరిగణించే పాతబస్తీని గురిపెట్టి పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ప్రారంభించారు. అదే ఇప్పుడు హిందూత్వ వాదం అయింది. బీజేపీ సెంటిమెంట్ అయిపోయింది. నేను హిందవునే అయితే బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలి అనే భావన రావడం లేదు. తెలంగాణ వాది అయితే టీఆర్ఎస్కు ఓటు వేయాలనే మైండ్ గేమ్ ఎలా నడిచిందో.. హిందువు అయితే బీజేపీకి ఓటు వేయాలన్న మెస్మరైజింగ్ కూడా అలాగే నడుస్తోంది.
మజ్లిస్‌ను పెంచి, పోషించి బీజేపీకి మేలు చేసిన కేసీఆర్..!
మజ్లిస్ అంటే… పాతబస్తీకే పరిమితమైన పార్టీ. కానీ ఆ పార్టీ ఇప్పుడు.. దేశం మొత్తం విస్తరిస్తోంది. ముస్లింలకు ప్రాతనిధ్యం వహించే పార్టీగా మారిపోయింది. అధికారంలో ఎవరు ఉంటే.. వారి ప్రాపకానికి మజ్లిస్ నేతలు పోటీ పడేవారు. మూసి దాటి బయటకు వచ్చేందుకు సాహసించేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పార్టీ… కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు విస్తరించింది. ఇలా ఓ పార్టీ మారిపోయినప్పుడు… దానికి ప్రత్యామ్నాయంగా పార్టీలు బలపడతాయి. బీజేపీకి అదే కలసి వస్తోంది. ముస్లింలదంరూ ఏకమైనప్పుడు.. హిందువులు ఎందుకు కాకూడదనే ప్రశ్న మౌలికంగా అందరిలోనూ వస్తోంది. వచ్చింది. మజ్లిస్ దేశ స్థాయిలో విస్తరించే ప్రణాళికల వెనుక కేసీఆర్ ఉన్నారనేది బహిరంగరహస్యం. మజ్లిస్ బలంతో.. జాతీయ రాజకీయాల్లో తన బలం పెంచుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అవుతోంది. తన సీటు కిందకే నీరు తీసుకు వస్తుంది. తెలంగాణ సెంటిమెంట్ ముందు మతం పని చేయదని ఆయన అనుకుని ఉండవచ్చు. కానీ ఎల్లకాలం ప్రజల మైండ్‌ను ఒకే అంశంపై ఉంచలేరు. ఈ సోషల్ మీడియా యుగంలో వారిని తరచూ భావోద్వేగానికి గురి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి.
కేటీఆర్ అభివృద్ధి నివాదం ఫెయిల్డ్ కాన్సెప్ట్..!
ఇప్పుడు అభివృద్ధి ఎవరికి కావాలి..!? రాజకీయాల్లో చూసి నేర్చుకోవాలి. అనుభవమైతేనే తత్వం బోథపడుతుది.. ఆ తర్వాత అనుభవాన్ని బట్టి నేర్చుకుందామని అనుకుంటే సాధ్యం కాదు. ఓ సారి అనుభవమైన తర్వాత.. మరోసారి అనుభవించడానికి చాన్స్ రాకపోవచ్చు. అంతా తెలిసి కూడా.. ఆ నిజాన్ని నమ్మలేకపోతున్నట్లుగా ఉన్నారు కేటీఆర్ లాంటి నేతలు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆయన అభివృద్ధి నినాదాన్ని వినిపిస్తోంది. ఆరేళ్లలో హైదరాబాద్ రూపు మార్చామని చెబుతున్నారు. నిజానికి రాష్ట్రం విడిపోతే.. హైదరాబాద్‌కు గడ్డు పరిస్థితి వస్తుందని అనుకున్నారు. కానీ ఆ అనుమానాల్ని పటాపంచలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం కన్నా.. మిన్నగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు లోపలే నగరం శివారు అనుకునే పరిస్థితి. ఇప్పుడు ఔటర్ దాడి.. పది.. ఇరవై కిలోమీటర్లు నగరం విస్తరిస్తోంది. దానికి తగ్గట్లుగా పోటీ పడి మౌలిక సదుపాయాల్ని కల్పించేందుకు కేసీఆర్ సర్కార్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. అభివృద్ది విషయంలో కేసీఆర్, కేటీఆర్ శ్రమను తక్కువ అంచనా వేయలేం. అందుకే తమ పనినే.. చూపించి ఓట్లు అడుగుతున్నారు. కానీ.. అభివృద్ధి గురించి ప్రజలు ప్రజలు పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయిందనే వాస్తవాన్ని కేటీఆర్ గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు ఓటు వేయడానికి ప్రాతిపదిక అభివృద్ధి కాదు… ఇంకేదో. అభివృద్ధి చూసే ఓట్లు వేసే జనం ఉంటే.. ఇప్పటికి దేశం రాత చాలా మారి ఉండేది. అయినా.. ఆ విషయాన్ని గుర్తించలేకపోవడమే కేటీఆర్ వైపు నుంచి జరుగుతున్న అతి పెద్ద బ్లండర్.
భావోద్వేగాలతో రాజకీయం పులిమీద స్వారి లాంటిదే..!
ప్రస్తుత కాలంలో ప్రజల్ని భావోద్వేగానికి గురి చేయడం చాలా ఈజీగా మారిపోయింది. సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత … అందులో వచ్చిందే కరెక్టే అనుకునే జనం అత్యధికం ఉన్న భారత్‌లో ఇది మరీ సులువైపోయింది. ఈ పాయింట్ ను క్యాచ్ చేసుకున్న పార్టీలు.. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను గుర్తించి.. కులం, మతం, ప్రాంతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నాయి. ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టి ద్వేషభావనలు పెంచుతున్నాయి. ఒకరికి వ్యతిరేకంగా తమకు ఓటేయాలన్న భావన కల్పిస్తున్నాయి. దాని వల్ల వారు రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ ఒకరిని చూసి ఒకరు.. వేర్వేరు రకాల భావోద్వేగాలను పెంచుతున్నారు. మొన్న ప్రాంతం.. నిన్న కులం.. నేడు మతం.. ఇదే నడుస్తోంది. తర్వాత ఇంకొకటి రావొచ్చు. ఓట్ల ప్రజాస్వామ్యంలో వాటిదే గెలుపు.