తెలంగాణలో రాజకీయాలు విచిత్రంగా మారిపోయాయి. నిన్నటి వరకూ గవర్నర్ ను బీఆర్ఎస్ నేతలు తప్పు పట్టారు. ఇవాళ మాత్రం.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీలో గవర్నర్ చెప్పినవన్నీ అబద్దాలేనని మండి పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చినవి చదివారని అందులో ఒక్క నిజం లేదని.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. అయితే గవర్నర్ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తాము ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తి స్థాయిలో చదవడంతో బీఆర్ఎస్ నేతలు ఖుషీ అవుతున్నారు.
అనేక మలుపులు తిరిగిన వివాదం తర్వాత గవర్నర్ తమిళి సై .. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని యథాతథంగా చదివారు. అందులో తెలంగాణ సర్కార్ చెప్పుకుటున్న విజయాలన్నీ ఉన్నాయి. గతంలో వీటిని తమళిసై విమర్శించి ఉన్నారు. అయినా వాటిని చదవక తప్పలేదు. మామూలుగా గవర్నర్ ప్రసంగాన్ని బీఆర్ఎస్ వద్దనుకుంది. కానీ కోర్టులో జరిగిన పరిణామాలతో గవర్నర్ ప్రసంగాన్ని అంగీకరించక తప్పలేదు. అప్పట్నుంచి రెండు, మూడు సార్లు అభిప్రాయాలు తెలుసుకుని మరీ ప్రసంగాన్ని ఆమోదించారు. దీంతో గవర్నర్ కూడా వివాదాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం ఇచ్చింది చదివారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఎలాంటి వివాదాలు లేకుండా సాగిపోయింది. చాలా కాలంగా ప్రభుత్వం గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ సారి అలాంటి పరిస్థితి రానివ్వలేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ తమిళిసైకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను అనుసరించారు. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమకు కేటాయించిన సీట్లలో నుంచి లేచి గవర్నర్ కు, ముఖ్యమంత్రికి అభివాదం చేశారు. ప్రసంగం పూర్తైన తర్వాత సభ నుంచి వెళ్తున్న సమయంలో మండలి చైర్మన్, స్పీకర్, సీఎం కేసీఆర్, మంత్రి వేముల తమిళిసై వెంట నడిచారు.