రాహుల్ గాంధీ కన్యాకుమరి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర ప్రారంభించారు. తమిళనాడులోనే ఆయన పాదయాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది. బీజేపీ విధానాలు.. దేశం వెనుకబాటు , పన్నుల మోత సహా ఇతర అంశాలపై కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అయితే వీటికి సమాధానం ఇవ్వాల్సిన బీజేపీ విచిత్రమైన వాదనలను తెరపైకి తెస్తుంది. రాహుల్ గాంధీ రూ. నలభై వేల ఖరీదైన టీషర్ట్ వేసుకున్నారని..భారత్ ..దేఖో అంటూ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
నిజానికి ఇలాంటివి సోషల్ మీడియాలో పార్టీల కింది స్థాయి ట్రోలర్స్ చేస్తారు. కానీ బీజేపీ హ్యాండిల్‌లోనే దీన్ని పోస్ట్ చేయడంతో అదే స్థాయిలో బీజేపీకి కౌంటర్లు వస్తున్నాయి.రూ. నలబైవేల టీషర్ట్ పైనే చర్చ కావాలా.. దేశంలోని సమస్యలు వద్దా అని ప్రశ్నిస్తున్నారు. దేశానికి మూడు ప్రధానులను ఇచ్చిన కుటుంబంలో ఓ వ్యక్తి కాస్త క్వాలిటీ టీషర్ట్ వేసుకోవడానికి అర్హులు కారా అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో మోడీ డ్రెస్సింగ్‌పై కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చకు పెడుతున్నారు.
ఆయన అత్యంత ఖరీదైన దుస్తులు ధరిస్తారని.. వాటి బడ్జెట్ ఏటా కోట్లలోనే ఉంటుందని అంటున్నారు. రాహుల్ గాంధీ సొంత డబ్బులు పెట్టి కొనుక్కుంటే.. మోడీ ప్రజల డబ్బులను వృధా చేస్తున్నారని మండి పడుతున్నారు. మోడీ డ్రెస్సింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయినా బీజేపీ సోషల్ మీడియాది భావదారిద్ర్యం కాకపోతే.. ఇలాంటి అంశాలను కూడా హైలె్ట చే్యడం ఏమిటన్న ప్రశ్నలు ఆ పార్టీ సానుభూతిపరుల నుంచే వస్తున్నాయి.