తెలుగుదేశం పార్టీ, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో బీజేపీ జత కట్టడం తనకు ఇష్టం లేదని ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా చెపుతూనే ఉన్నారు. ఓటుకి నోటు కేసు బయటపడిన వెంటనే ఆయన మళ్ళీ మరో మారు అదే విషయం చెప్పి ఈ కేసులో తమ పార్టీ కలుగజేసుకోదని తేల్చిచెప్పారు కూడా. కానీ బీజేపీకి ఒక్క హైదరాబాద్ లో తప్ప మరెక్కడా బలం లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆయనకి గుర్తు చేశారు. కేవలం హైదరాబాద్ లో ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకొన్నంత మాత్రాన్న తెలంగాణా రాష్ట్రమంతతా బీజేపీ బలంగా ఉన్నట్లేనా? హైదరాబాద్ లో తప్ప మరెక్కడా బలం లేనప్పుడు వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో ప్రత్యామ్నాయ శక్తిగా ఏవిధంగా ఎదగగలమని అనుకొంటున్నారు? అని అమిత్ షా వేసిన ప్రశ్నలకి కిషన్ రెడ్డితో సహా రాష్ట్ర నేతలెవరి దగ్గర సరయిన సమాధానాలు లేవు. అందుకే ఇంతకు ముందు తెదేపాతో పొత్తుల తెంపుకోవడం గురించి, ఓటుకి నోటు కేసు గురించి గడగడా మాట్లాడిన కిషన్ రెడ్డి ఇప్పుడు అదే నోటితో జి.హెచ్.యం.సి.మరియు వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలలో తెదేపాతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. అంతే కాదు ఓటుకి నోటు కేసుతో తెలంగాణాలో తెదేపాను కనబడకుండా చేయాలని ప్రయత్నించి తెరాస భంగపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రాజకీయ చదరంగంలో చివరికి తెరాసయే ఎక్కువ నష్టపోయిందని ఆయన అభిప్రాయం పడ్డారు.
ఓటుకి నోటు కేసులో తెదేపాకి ఎంత చెడ్డ పేరు వచ్చినా తెలంగాణా రాష్ట్రమంతటా ఆ పార్టీకి బలమయిన క్యాడర్ ఉంది. కానీ బీజేపీకి మాత్రం ఒక్క హైదరాబాద్ లో మాత్రమే బలముందని అమిత్ షాయే తేల్చి చెప్పారు. కనుక తెలంగాణాలో బీజేపీకి తెదేపా మద్దతు చాలా అవసరం ఉందని రాష్ట్ర నేతలకంటే ముందు అమిత్ షాయే గ్రహించారు. (అమిత్ షా ఒక్కరే కాదు… తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఆ సంగతి గ్రహించారు కనుకనే వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో నుండి తెదేపాను తుడిచిపెట్టేయాలని ప్రయత్నిస్తున్నారని భావించవచ్చును.) వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలలో బీజేపీ గెలవాలంటే తప్పనిసరిగా తెదేపా సహాకారం కావలసిందే. ఒకవేళ కడియం శ్రీహరి ఖాళీ చేసిన వరంగల్ లోక్ సభ స్థానానికి పోటీ చేయాలన్నా మళ్ళీ అదే పరిస్థితి. అందుకే ఇప్పుడు కిషన్ రెడ్డి అకస్మాత్తుగా తెదేపాకు అనుకూలంగా మాట్లాడుతున్నారని భావించాల్సి ఉంటుంది.