భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారనీ, రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడం కోసం ఆయన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని ఆ మధ్య టి. నేతలు చెప్పేవారు. దానికి అనుగుణంగానే, అమిత్ షా సభలూ సమావేశాలూ నిర్వహిస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ప్రధానమంత్రితోపాటు భాజపా అగ్రనాయకులంతా తెలంగాణలో పర్యటించారు. కానీ, ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే భాజపాకి వచ్చింది. ఈ ఫలితాలతో తెలంగాణ భాజపా శ్రేణులు బాగా డీలా పడ్డాయి. ఇంకా కోలుకుంటున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితిపై పార్టీలోనే కొంత ఆవేదన వ్యక్తమౌతోంది.
తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ గెలుపుతో తెరాస ఉత్సాహంగా అభ్యర్థుల ఎంపిక పనిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకొంటోంది. దీంతో కొంత హడావుడి ఆయా పార్టీల్లో కనిపిస్తోంది. భాజపా మాత్రం ఈ ఎన్నికలవైపు చూస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన చర్చే పార్టీ వర్గాల్లో జరగడం లేదని సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో పోటీని భాజపా సీరియస్ తీసుకునే అవకాశం కనిపించడం లేదు! ఒకవేళ అభ్యర్థుల్ని ఎంపిక చేసి బరిలోకి దించినా, ఆ తరువాత వారు పార్టీ మారిపోయే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉందని అంటున్నారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని.. ఇప్పట్నుంచే పార్టీ కార్యకలాపాలు మరోసారి ఉత్సాహవంతంగా పునః ప్రారంభించేందుకు ఈ పంచాయతీ ఎన్నికలు ఒక వేదికగా మార్చుకోవచ్చు. కానీ, ఆ కోణంలో రాష్ట్ర భాజపా ఆలోచిస్తున్నట్టు లేదు. పైగా, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని నిలబెట్టడం అనవసరపు ఖర్చు అనేట్టుగా భావిస్తోందనీ కొందరు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంపై భాజపా అధినాయకత్వం ప్రత్యేకదృష్టి పెట్టడం లేదనే అసంతృప్తి టి.భాజపాలో వినిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్ని ఖర్చు అనుకునే కంటే, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకునేందుకు వచ్చిన అవకాశంగా చూడాలనే డిమాండ్ టి. భాజపా వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి, పార్లమెంటు ఎన్నికల విషయంలో తెలంగాణలో భాజపా అనుసరించబోయే వైఖరి ఏంటనే స్పష్టత అధినాయకత్వం నుంచి రావాల్సి ఉంది. తెలంగాణలో ఎంత ప్రయాసపడినా అనూహ్య ఫలితాలు ఉండవనే అనుభవం అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే ఇచ్చేశాయి కదా! ఈ నేపథ్యంలో కొత్త వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.