ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి అప్పుడే కనిపిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో ఇప్పుడు పోల్ సమీకరణాలు పక్కాగా ఉండేలా చూసుకుంటే ప్రభుత్వాన్ని మార్చవచ్చని విపక్షాలు ఆలోచన చేస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ- జనసేన జత కట్టడం అన్నది అందరికీ కామన్ పాయింట్‌గా మారింది. ఓట్ల సమీకరణలు.. లెక్కలు చూసుకున్న తర్వాత టీడీపీ – జనసేన డెడ్లీ కాంబినేషన్ అవుతుందని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. అందుకే ఎక్కువ మంది ప్రభుత్వం మారాలనుకునేవారు టీడీపీ – జనసేన పోటీ చేయాలని కోరుకుంటున్నాయి.
అయితేజనసేన ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉంది. కానీ మెల్లగా దూరం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. సోము వీర్రాజు కూడా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ జనసైనికుల ఆగ్రహానికి గురవుతున్నారు. అదే సమయంలో ఆయన ప్రో వైసీపీ నేచర్ తోనే జనసేన దూరంగా ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో జనసేన కటిఫ్ చెప్పడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ లేకుండా పొత్తులు ఉండవని.. 2014 తరహాలోనే కలిసి పని చేస్తారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చని.. ఇప్పటికైతే సైలెన్స్ పాటిస్తున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు బీజేపీ స్థానంలోకి వామపక్షాలు వస్తున్నాయి. టీడీపీ, జనసేనతో పాటు వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయన్న వాదన వినిపిస్తోంది. శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఈ వ్యాఖ్యలను తమ పార్టీ సమావేశంలోనే ప్రకటించారు. బీజేపీపై ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం… వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న తీరు చూసి… రాష్ట్రంలో సమస్యలన్నింటికీ బీజేపీనే కారణమన్న అభిప్రాయం ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున.. ఆ పార్టీతో వీలైనంత దూరం పాటించడమే మేలని ఎక్కువ పార్టీలు భావిస్తున్నాయి. టీడీపీ కూడా అదే బాటలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.