ఏపీలో పొత్తుల అంశంపై అధికారిక ప్రకటన శనివారం వెనలువడనుంది. సీట్ల సంఖ్యపై నిన్ననే స్పష్టత వచ్చింది. ఎంపీ సీట్లు ఎక్కువ కావాలని బీజేపీ హైకమాండ్ అడిగింది. అందుకే జనసేనకు మూడే పార్లమెంట్ సీట్లు ఇచ్చినా బీజేపీకి ఐదు సీట్ల వరకూ కేటాయిచాలని నిర్ణయించారు. ఆరు అసెంబ్లీ సీట్లను ఫైనల్ చేశారు. ఏయే సీట్లు అన్నదానిపైనా స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తోంది.
మహారాష్ట్రలో పొత్తులు, పార్టీలతో చర్చల కారణంగా అధికారిక ప్రకటన ఆలస్యమయింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటన శనివారం చేస్తారు. అమిత్ షా శనివారం పాట్నా వెళ్తున్నారు. అంతకు ముందే ప్రకటన ఉండే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు విషయంలో ఇప్పటికే టీడీపీ క్యాడర్ కూడా మానసికంగా రెడీ అయ్యారు. జనసేన పార్టీ కొన్ని త్యాగాలకూ సిద్ధమయింది. బీజేపీ ఉంటేనే ఏపీలో ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకంతో ఉన్నారు. ఈ కారణంగానే ఆ పార్టీకి ఒక్క శాతం బలం లేకపోయినప్పటికీ సీట్లు కేటాయిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం నడవాలంటే… కేంద్రం సహకారం తప్పనిసరి. కేంద్ర ప్రాజెక్టులతో పాటు… ఈ ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులతో ముందు ముందు…. వడ్డీలు చెల్లించడానికి ఆదాయం కూడా సరిపోని పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో రాజకీయంగా కూడా వైసీపీని పాతాళంలోకి తొక్కడానికి బీజేపీ సహకారం తప్పనిసరి అని నమ్ముతున్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తగినంత విధంగా పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో … టీడీపీ, జనసేన తెలివైన నిర్ణయం తీసుకున్నాయన్న అభిప్రాయాన్ని రాజకీయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.