అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభించిన రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పక్షాలు సంఘిభావం తెలిపాయి. బీజేపీ – జనసేన ప్రతినిధులు కూడా వచ్చారు. ఆదివారం రోజు పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొనాల్సి ఉంది.కానీ పాల్గొనలేదు. దీనికి కారణం.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోధర్ పాదయాత్రలో పాల్గొనవద్దని పార్టీ నేతలను ఆదేశించడమేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అమరావతికి మొదటి నుంచి బీజేపీ బహిరంగంగా మద్దతు పలుకుతోంది. వెనుక నుంచి నొసటితో వెక్కిరిస్తోంది. విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు రైతులకు సంఘిభవం చెప్పడం.. మరో వైపు మహిళా రైతుల డ్రెస్సింగ్‌పై వ్యాఖ్యలు చేయడం వంటివి చేశారు.
ఇక జనసేన నేత పవన్ కల్యాణ్ నేరుగా రాజధానికి మద్దతు ప్రకటించారు. మూడు రాజధానులు బూటకమని.. అమరావతినే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే అటు బీజేపీ అయినా.. ఇటు జనసేన అయినా మాటల్లోనే ఉంటున్నాయి. ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే నేరుగా అమరావతికి మద్దతు సపోర్ట్ స్టాండ్ తీసుకోవాలి.. లేకపోతే నిజాయితీగా మద్దతు ప్రకటించాలి కానీ ఈ దొంగాట ఏమిటన్న అభిప్రాయం అందరిలోనూ వినిపిస్తోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిన వర్గం అమరావతిపై కుట్రలు చేస్తోందని.. మిగిలిన వారు మద్దతుగా ఉన్నారన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే అమరావతిని కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. రైతుల త్యాగాలను బలి చేస్తే తమకెంత లాభం… మద్దతు ప్రకటిస్తే ఎంత లాభం అని లెక్కలేసుకునే రాజకీయాలు చేస్తున్నారు. దీంట్లో జనసేన కూడా భాగమయింది. దీంతో అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.