రామతీర్థం ఘటన నుంచి రాజకీయ తీర్థం పొందడానికి బీజేపీ, జనసేన కూడా రెడీ అయ్యాయి. రామతీర్థం ఘటన రాజకీయ అంశం కాదని… బీజేపీ నేతలు సోము వీర్రాజు లాంటి వాళ్లు ప్రకటించారు. అంటే..బహుశా.. ఇక దాని గురించి వారు పట్టించుకోరేమో అని అనుకున్నారు. కానీ వెంటనే.. తాము నాలుగో తేదీన రామతీర్థం వెళ్తామని ప్రకటించారు. సాయంత్రానికి మళ్లీ షెడ్యూల్ మారిపోయింది. ఐదో తేదీకి మారింది. బీజేపీ మాత్రమే కాదు.. జనసేన కూడా.. రామతీర్థానికి వెళ్లేవారి జాబితాలో చేరింది.
ఢిల్లీలో ఉన్న సోము వీర్రాజు.. రామతీర్థం ఘటనపై… హైకమాండ్ పెద్దలతో చర్చించారు. రామతీర్థం ఘటన విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆలయాలపై జరుగుతున్న దాడుల వ్యవహారాన్ని చంద్రబాబు టేకప్ చేశారని … ఇప్పుడు మనం బ్యాటన్ అందుకోవాల్సిన సమయం వచ్చిందని నిర్ణయం తీసుకున్నారు. రంగంలోకి దిగాలనుకున్నారు. అందుకే రామతీర్థం యాత్ర పెట్టుకున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. ఏపీ బీజేపీ నేతలు.. వైసీపీతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారు. వారు సీరియస్గా వైసీపీని విమర్శించినా… ప్రజలు మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటున్నారు. అందరూ లైట్ తీసుకుంటున్నారు. మరి సీరియస్ నెస్ రావాలంటే.. ఏం చేయాలో చర్చించి.. చివరికి జనసేనను కలపాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకూ బీజేపీ అధికారికంగా చేపట్టిన పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా జనసేనను కలుపుకోలేదు. తాజాగా కలుపుకున్నారు. పవన్ కల్యాణ్ కూడా బీజేపీలో చేరిన తర్వాత.. హిందూత్వ వాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఐదో తేదీన జనసేన, బీజేపీ రామతీర్థ ధర్మయాత్ర చేసి… రాజకీయ తీర్థాన్ని తాము కూడా కొంచెం అందుకోవాలని నిర్ణయించారు. మరి వారి పర్యటనకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి..!