భాజపాకి ఉత్తరభారతదేశంలోనే ఎక్కువ పట్టున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ రాన్రాను ప్రతీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు చాలా బలపడుతుండటం చేత అక్కడ కూడా ఎదురుదెబ్బలు తప్పడం లేదు. డిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలే అందుకు చక్కటి ఉదాహరణ. కనుక ప్రాంతీయ పార్టీలతో పోత్తులకి అది సిద్దపడినా, ప్రాంతీయ పార్టీలు అందుకు సిద్దంగా లేకపోవడం మరో సమస్యగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అధికార అన్నాడిఎంకె పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆమె తృణీకరించడంతో బొత్తిగా బలం, పట్టులేని తమిళనాడులో ఒంటరి పోరాటం చేసి భాజపా ఓడిపోవడం అందరూ చూశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణాలో తెరాసతో దోస్తికి సిద్దమని ప్రకటిస్తే, “భాజపాతో స్నేహం మాకు అక్కరలేదని” ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్మొహమాటంగా చెప్పారు.
వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, భాజపాలకి చాలా కీలమైనవి. అక్కడ కూడా భాజపాకి ఒంటరి పోరాటం, ఎదురీత తప్పేలా లేదు. అధికార సమాజ్ వాదీ పార్టీ భాజపాతో పొత్తులు పెట్టుకొనే అవకాశమే లేదు. ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి కూడా భాజపాతో పోత్తులకి అంత ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
కనుక ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్.జె.పి.)తో కలిసి పోటీ చేయడానికి భాజపా సిద్దం అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు రాం విలాశ్ పాశ్వాన్ ప్రస్తుతం కేంద్రమంత్రిగా కూడా ఉన్నారు కనుక ఆ రెండు పార్టీల మద్య పొత్తులు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు మంచి ఆధిపత్యం కలిగి ఉన్నపుడు, కేవలం బిహార్ రాష్ట్రంలో మాత్రమే పట్టున ఎల్.జె.పి.తో పొత్తులు పెట్టుకోవడం వలన భాజపాకి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.
ఈసారి ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించి మళ్ళీ రాష్ట్ర, దేశ రాజకీయాలపై పట్టు సాధించాలని కాంగ్రెస్ అధిష్టానం చాలా పట్టుదలగా ఉంది. అందుకోసం అది ఈసారి ప్రియాంకా గాంధీని ఎన్నికల ప్రచార రధసారధిగా చేసుకొని, ఎన్నికల వ్యూహ నిపుణుడుగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ సేవలని ఉపయోగించుకొంటోంది.
అధికార సమాజ్ వాదీ పార్టీ పట్ల, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం అధికారంలో ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చే అంశమే అవుతుంది. ఈ నేపధ్యంలో భాజపా విజయం సాధించడానికి చాలా ఎదురీత తప్పక పోవచ్చు. ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ పాలనకి రిఫరెండంగాను, అమిత్ షా శక్తియుక్తులకి పరీక్షగాను నిలుస్తాయి. వాళ్ళిద్దరూ ఈ పరీక్షలో పాస్ అవడానికి ఎటువంటి వ్యూహ రచన చేస్తారో..అది ఫలిస్తుందో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది మార్చి వరకు వేచి చూడాల్సిందే!