అనుకున్నదే జరిగింది. లలిత్ మోడీ వివాద ప్రకంపనలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. సంఖ్యాబలంలో ప్రతిపక్షాలదే పైచేయిగా ఉన్న రాజ్యసభలో రోజంతా మైండ్ గేమ్ నడిచింది. లలిత్ మోడీ వ్వహారంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె రాజీనామా చేయాలని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులందరూ ఈ డిమాండుకు శ్రుతి కలిపారు. తొలిరోజే బీజేపీని వీలైనంత డిఫెన్స్ లో పడేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అయితే అనూహ్యంగా కేంద్రం ఈ ఎత్తుకు పై ఎత్తు వేసింది.
ఈ వివాదంపై వెంటనే చర్చకు సిద్ధమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఒక్క క్షణం విపక్షం షాకైనట్టు కనిపించింది. కేంద్రం ఇంత త్వరగా చర్చకు ఒప్పుకుంటుందని విపక్షం భావించలేదని అర్థమైంది. అందుకే, వెంటనే చర్చను మొదలుపెట్టకుండా అరుపులు కేకలతో కొందరు సభ్యులు గందరగోళం సృష్టించారు. దీంతో సభ పదే పదే వాయిదా పడింది. చివరకు లెఫ్ట్, ఎస్పీ సభ్యులు కొత్త ఎత్తు వేశారు. సుష్మా, వసుంధర రాజీనామా చేసిన తర్వాతే చర్చ మొదలుపెట్టాలని కొత్త డిమాండ్ చేశారు. దీన్ని అధఇకార పక్షం తోసిపుచ్చింది.
వారు రాజీనామా చేస్తే ఇక చర్చ ఏముంటుంది? దీనికి బీజేపీ ఒప్పుకోదని తెలిసే విపక్షం మైండ్ గేమ్ ఆడింది. అధికార పక్షం పదునుగా ఎదురు దాడి చేసింది. ప్రతిపక్షాలకు చర్చమీద నమ్మకం లేదని, సభను అడ్డుకోవడమే వారి ఉద్దేశమని అధికార పక్షం ఆరోపించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్ల మధ్య సభ రేపటికి వాయిదా పడింది. బుధవారం సైతం చర్చ జరిగే అవకాశం కనిపించడం లేదు. మొత్తం మీద ఈ సమావేశాల్లోనూ రాజ్యసభలో చర్చకు బదులు అంతా రచ్చ రచ్చ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రతిపక్షాలు చేసే ఏ డిమాండుకూ తలొగ్గరాదని మోడీ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. తనకు మెజారిటీ ఉన్న లోక్ సభలో విపక్షాలను కట్టడి చేయడం కష్టం కాదని కమలనాథులు భావిస్తున్నారు. రాజ్యసభలో ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ చేస్తూ ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ ఎత్తులు పైఎత్తుల మధ్య ప్రజా సమస్యలు, బిల్లులపై చర్చ మాత్రం అనుమానమే.