తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమయింది. ఆరు నెలల తర్వాత ఎలాగూ.. పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఆరు నెలల ముందు ఎన్నికలు జరిగినా.. ముందస్తు కాదని చెబుతున్న కేసీఆర్.. ఎన్నికలకు సిద్ధమయ్యారు. కానీ టీఆర్ఎస్ చాలా కాలం నుంచి జమిలీ ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. లా కమిషన్ ముందు కూడా.. ఇదే వాదన వినిపించింది. జమిలీ ఎన్నికల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని.. టీఆర్ఎస్ ఏకరువు పెట్టింది. కానీ అదే టీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణలో జరగాల్సిన జమిలీ ఎన్నికలను… విడగొట్టి.. అసెంబ్లీకి ఓ సారి.. పార్లమెంట్‌కు ఓ సారి ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేసుకుంటోంది. తన విధానాన్నే టీఆర్ఎస్ ఎందుకు ఉల్లంఘిస్తోంది..?
అసలు జమిలీ ఎన్నికల నినాదం భారతీయ జనతా పార్టీది. ఖర్చుతో పాటు దేశంలో ఎప్పుడూ ఎన్నికల వాతావరణమే ఉంటోందన్న కారణం చూపి.. జమిలి ఎన్నికలు నిర్వహించడానికి చాలా కాలంగా కసరత్తు చేస్తోంది. నీతిఆయోగ్, లా కమిషన్లను.. దీని కోసం పురమాయించింది. ఓ రకంగా ఇప్పుడు జమిలి ఎన్నికల కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఒకే సారి దేశం మొత్తం జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి… 2019లో కొన్ని.. 2024లో అన్ని రాష్ట్రాలతో పార్లమెంట్‌కు ఎన్నికలు నిర్వహించాలని దాదాపుగా ప్లాన్ రెడీ చేసుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ఈ విషయంలో దూకుడుగా వెళ్లడం లేదు. 2019లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు పార్లమెంట్‌కు ఎన్నికలు నిర్వహించాలంటే.. ముందుగా రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ ఎన్నికలను వాయిదా వేయాలి. అలా వేయాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాలి. ఇప్పుడు దానికి సమయం మించిపోయింది. హడావుడిగా చేస్తే.. అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంది.
ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. షెడ్యూల్ ప్రకారమే మూడు రాష్ట్రాల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంటే జమిలి కాన్సెప్ట్‌ను బీజేపీ దాదాపుగా పక్కన పెట్టేసినట్లే. అంతే కాదు… పరోక్ష మిత్రపక్షం టీఆర్ఎస్ కోసం.. మరింతగా వెసులుబాటు కల్పిస్తోంది. తెలంగాణలో జమిలిగా జరగాల్సిన ఎన్నికలను విడివిడిగా నిర్వహించడానికి కూడా సహకరిస్తోంది. కేంద్రం సహకారం లేకపోతే… తెలంగాణలో కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. అంటే.. జమిలి జపం చేసిన బీజేపీ, టీఆర్ఎస్ ఇప్పుడు.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం.. విధానాన్ని సడలించుకుంటున్నాయి.