తెలంగాణ రాజకీయాల్లో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ అవినీతి చిట్టా మొత్తం తమ చేతుల్లో ఉందని బీజేపీ నేతలు చాలా కాలంగా చెబుతున్నారు. కేసీఆర్ను జైలుకు పంపడం ఖాయమనేనంటున్నారు. అయితే ఇప్పటి వరకూ ఏమీ చేయలేదు. కనీసం చిన్న విచారణ జరగలేదు. కేసీఆర్ కూడా అంతే. కేంద్రం అవినీతి చిట్టా మొత్తం తమ దగ్గర ఉందని అంటున్నారు. లెక్కలన్నీ బయట పెడతామని కేసీఆర్ కూడా నేరుగా హెచ్చరిస్తున్నారు. మోదీ జాతకం అంతా ప్రగతి భవన్ లో రెడీ గా ఉంది, ఎవరెవరికి ఎంత దోచిపెట్టారో చిట్టా అంతా ఉందని మొన్నీమద్య కేసిఆర్ కూడా అన్నారు.
కొంత కాలంగా రెండు పార్టీలదీ అదే వైఖరి. విచిత్రంగా సమాచార హక్కు చట్టం సాయంతో వెలుగులోకి తెస్తున్న లెక్కలపైనే టీఆర్ఎస్ ఆధారపడుతోంది. ఆ వివరాలతోనే కేంద్రం అవినీతే కాదు ఆయా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అవినీతిని కూడా బయటపెట్టాలని అనుకుంటున్నారు.. హెచ్చరిస్తున్నారు. కానీ ఈ విషయంలో అడుగు కూడా మందుకు పడటం లేదు. బీజేపీ కూడా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేసి ఇక టీఆర్ఎస్ అవినీతి అంతా బయటకు వస్తుందని ప్రచారం చేసేస్తోంది.
అధికారంలో ఉన్న పార్టీలపై ప్రధానంగా వచ్చే ఆరోపణ అవినీతి. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఒకరిపై ఒకరు పోరాడుతూ ఈ అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాజకీయం మాత్రం జోరుగా చేసుకుంటున్నారు. తమ మధ్యనే పోరాటం ఉందని చెప్పుకోవడానికన్నట్లుగా … ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కానీ ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు. సామెత చెప్పినట్లుగా… చివరికి ఎవరి అవినీతి ఎవరూ తేల్చరు. ప్రజల్ని ఎంత ఎక్కువగా ఎవరు నమ్మిస్తారో వారే నిజాయితీపరులు.