రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. ఓ యాక్షన్‌కు రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఎన్డీఏ నుంచి ఎంతో మంది భాగస్వాములు వెళ్లిపోయినా రిపబ్లికన్ పార్టీ పేరుతో మహారాష్ట్రాలో రాజకీయాలు రామ్ దాస్ అథవాలే మాత్రం మోడీని అంటి పెట్టుకుని ఉన్నారు. ఆయన ఇప్పుడు ఇతర మిత్రుల్ని ఎన్డీఏలోకి తేవాలని అనుకుంటున్నారేమో కానీ రాష్ట్రాలు పర్యటించి.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలను ఎన్డీఏలో చేరాలని మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. అలా ఏపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కూడా ఎన్డీఏలోకి ఆహ్వానించారు.
అథవాలే జగన్నే ఎందుకు ఆహ్వానించారు.. గతంలో ఎన్డీఏలో ఉన్న టీడీపీని ఎందుకు ఆహ్వానించలేదన్నది కొంత మందికి పజిల్‌గానే ఉంది. అయితే అథవాలే.. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి.. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి అధికారికంగా ఎన్డీఏలోకి రావాలని ఆయన కోరి ఉంటారు. ఇప్పుడే కాదు గతంలోనూ ఆయనజగన్‌కు ఇలాంటి విజ్ఞప్తులు చేశారు. నిజానికి ఎన్డీఏలోకి జగన్‌ను ఆహ్వానించడం కానీ ఆ పార్టీ వచ్చి చేరిపోతుదంని చెప్పడం కానీ అంతా ఆయన వ్యక్తిగతం. ఎందుకంటే ఎన్డీఏ తరపున కేంద్రమంత్రి అథవాలేకు ప్రత్యేక బాధ్యతలు లేవు.
అయితే అథవాలే ప్రకటనపై వైసీపీ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుందని అనుకున్నారేమో కానీ సైలెంటయిపోయారు. అయితే బీజేపీ నాయకుడు లంకా దినకర్‌కు మాత్రం కోపం వచ్చింది. అథవాలేపై మండిపడ్డారు. అసలే ఏపీలో వైసీపీకి తోక పార్టీలా ఉందన్న విమర్శల నేపధ్యంలో అథవాలే వ్యాఖ్యలు తమపై మరింత ముద్ర వేస్తాయని ఆయన బాధపడి ఉంటారు. అయితే ఆయన ఒక్కరే స్పందించారు. ఇతర నేతలందరూ లైట్ తీసుకున్నారు.
అథవాలే ఎపీకి వచ్చి జగన్‌కు ఆహ్వానం అందించడం వెనుకరాజకీయం ఉందా లేకపోతే ..యాధృచ్చికంగానా అన్నది కొద్దిరోజుల్లో తేలే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు వ్యూహాలు మెరుగుపరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏమైనా జరగవచ్చన్నది కొందరి మాట.