లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అయింది. పూర్తి మెజార్టీ రాకపోవడానికి కారణాన్ని విశ్లేషించుకున్న తర్వాత ఆ పార్టీ అగ్రనేతలకు కోపం నషాళానికి అంటుతోంది. తమ స్వయం తప్పిదమైతే మారేందుకు.. మార్చుకునేందుకు ప్లాన్లు వేసుకునేవారేమో కానీ ఇక్కడ అంతా చెడగొట్టింది టీవీ 9 భారతవర్ష ఎడిటర్ హేమంత శర్మ. యూపీ బీజేపీ వ్యవహారాల్లో అంతర్గత జోక్యం చేసుకుని అభ్యర్థుల విషయంలో చేసిన రచ్చ కారణంగానే యూపీలో బీజేపీకి భారీగా సీట్లు తగ్గాయని అంచనాకు వచ్చారు. ఇప్పుడు టీవీ 9పై రివెంజ్ ప్లాన్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
యూపీ బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న టీవీ9 భారతవర్ష ఎడిటర్
కేంద్ర మంత్రి పదవులు మీకే అంటూ మీడియా చానళ్లలో బ్రేకింగులు వేసేస్తారు.. అలాంటివి నమ్మకండి.. అని ప్రధాని మోదీ ఎన్డీఏ సమావేశం సందర్భంగా చేసిన స్పీచ్‌లో ప్రత్యేకంగా చెప్పారు. మోదీ ఈ మాటలు ఆషామాషీగా అనలేదు. దీనికి బ్రేక్ గ్రౌండ్ ఉంది. అదే టీవీ 9 భారత్ వర్ష్ చేసిన రచ్చ. అసలేం జరిగిందంటే ?
అభ్యర్థుల ఎంపికలో తప్పులు హేమంత శర్మ నిర్వాకమే !
టీవీ 9 భారత్ వర్ష్ హిందీ చానల్ కు ఎడిటర్ గా హేమంత శర్మ ఉన్నారు. తెలుగు చానల్ బాధ్యులు ఎలా అధికార పార్టీతో అంటకాగి జర్నలిజాన్ని తాకట్టుపెడతారో అక్కడ కూడా ఈ హిమంత శర్మ అదే చేశారు. కాకపోతే ఆయన మరింత అడ్వాంటేజ్ తీసుకున్నారు. బీజేపీ అంతర్గత విషయాల్లోకి చొచ్చుకెళ్లిపోయారు. అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకున్నారు. ఫలానా చోట ఫలానా అభ్యర్థి అంటూ తప్పుడు బ్రేకింగులు వేసి..పార్టీ నేతలపై ఒత్తిడి తెచ్చారు. తాను చెప్పిన అభ్యర్థులకు సీట్లిస్తే గెలుపు ఖాయమని నమ్మబలికాడు. యోగి ఆదిత్యనాథ్ ను ఆయన బాగా ప్రభావితం చేయడంతో … పార్టీ హైకమాండ్ అనుకున్న వారికి కాకుండా హేమంత శర్మ ఒత్తిడి చేసిన వారికి టిక్కెట్లు కేటాయించాల్సి వచ్చింది. దాంతో మొత్తం సమీకరణాలు దెబ్బతిన్నాయి. యూపీలో బీజేపీ బలం కోల్పోయింది.
హేమంతశర్మ నిర్వాకంపై బీజేపీ హైకమాండ్ గరంగరం
ఎన్నికల ఫలితాల తర్వాత విశ్లేషించుకున్న బీజేపీ హైకమాండ్ కు హేమంత శర్మ నిర్వాకం తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తమ అధికారాన్ని దాదాపుగా దూరం చేసింది హిమంతశర్మగా తేల్చుకుని టీవీ9 గ్రూప్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టీవీ9 గ్రూప్ హైదరాబాద్ కు చెందిన బడా వ్యాపారులు మేఘా కృష్ణారెడ్డి, మైహోమ్ రామేశ్వరరావుల చేతుల్లో ఉంది. మరికొంత బినామీల చేతుల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ దృష్టి వీరిపై పడింది. వీరు కుట్ర చేసి తమ పీఠం కిందకు నీళ్లు తెచ్చారేమో అన్న అనుమానాలకూ వస్తున్నారు. ఆ సెగ వీరికి తగలడం ఖాయమని ఢిల్లీ మీడియా వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
టీవీ9కి మిసెరబుల్ ట్రీట్ మెంట్ ఖాయమన్న సూచనలు
ఇప్పటికిప్పుడు బీజేపీ ఆగ్రహాన్ని తగ్గించేందుకు హేమంతశర్మను తీసేయాలన్నా.. ఈ బడా బాబులకు సాధ్యమయ్యే పరిస్థితి లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ చేపట్టబోయే ట్రీట్ మెంట్ కోసం ఈ బడాబాబులు మానసికంగా సిద్ధమవుతున్నాయి. ఓ వైపు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. మీడియా జోలికెళ్లి తమ అసలు వ్యాపార సామ్రాజ్యాలను కుప్పకూల్చుకోబోతున్నామా అని వారిలో ఆందోళన ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.