మూడు రాజధానుల అంశం కేంద్రం ఆమోదంతోనే చేస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీ తీరుపై.. బీజేపీ -జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డాను ఈ రోజు బీజేపీ – జనసేన నేతల బృందం కలిసింది. ఈ భేటీలో ప్రధానంగా.. వైసీపీ చేస్తున్న ప్రచారంపైనే చర్చ జరిగింది. కేంద్రం అనుమతితోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామన్న వైసీపీ వాదనలో నిజం లేదని.. ఈ విషయాన్ని కేంద్రం తనకు స్పష్టం చేసిందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇందులో ప్రధాని, హోం మంత్రి పాత్ర లేదన్నారు. కేంద్రం అనుమతితోనే వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చామన్న వైసీపీ అవాస్తవ ప్రచారాన్ని జనసేన, బీజేపీ ప్రతినిధులు తిప్పికొట్టాలని పవన్ పిలుపునిచ్చారు.
ఏపీ బీజేపీ పరిస్థితి విచిత్రంగాుంది. అమరావతి మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ… కేంద్ర అధికార పార్టీగా.. ఆ మార్పును అడ్డుకునే ప్రయత్నాన్ని ఇప్పటి వరకూ కనీసం కూడా చేయలేదు. దీంతో.. పాటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తాము అన్నీ కేంద్రానికి చెప్పే చేస్తున్నామన్నట్లుగా.. సంకేతాలు ప్రజల్లోకి బలంగా పంపుతూండటంతో.. బీజేపీ చిత్తశుద్ధిపై అందరికీ అనుమానం ప్రారంభమయింది. దీనిపై వివరణ ఇచ్చుకోవడానికి… బీజేపీ నేతలు తంటాలు పడుతున్నారు. కన్నా విధానంలో క్లారిటీ ఉంది.. కానీ జీవీఎల్ వాయిస్ మాత్రం తేడా వచ్చేసింది. రాజ్యాంగం ప్రకారం జరుగుతుందని.. రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
అదే సమయంలో.. కేంద్రానికి చెప్పే చేస్తున్నారని.. జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం అందరూ ఖండిస్తున్నారు. ప్రతీ సారి బీజేపీ నేతలకు ఇదే వివరణ ఇవ్వాల్సి వస్తోంది. బీజేపీ నేతలు.. జగన్ తమకు చెప్పి చేయలేదని.. ఒట్టు పెట్టి చెప్పడమే తక్కున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. అదే సమయంలో.. జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నారు. పోరాట ప్రణాళిక కూడా ప్రకటించారు. వారు పోరాటం ప్రారంభించిన తర్వాత ఆయినా కేంద్రం జోక్యం చేసుకోకపోతే.. వారి చిత్తశుద్ధి మీద ప్రజలకు అనుమానం కలగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.