“గాడిదలు కాస్తున్నారా..?” అంటూ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఘాటుగా స్పందించింది. అది కామనే. అయితే.. మరో పార్టీ కూడా.. అంతే తీవ్రంగా స్పందించింది. పైగా ఆ పార్టీ టీడీపీ మిత్రపక్ష పార్టీ కాదు… బద్దశత్రువు. తాము ఒక్క శాతం ఓట్ల కంటే తక్కువకు పడిపోవడానికి కారణం చంద్రబాబేనని నిందించేపార్టీ. ఆ పార్టీనే భారతీయ జనతా పార్టీ. మాజీ మంత్రి మాణిక్యాలరావు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి… వైసీపీ తీరుపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో “గాడిదలు కాస్తున్నారా..?” అనే మాటలు మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. జగన్ నీచమైన భాషను వాడటం సరికాదని హితవు పలికారు. గ్రామ వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలను నియమించుకుంటున్నారని ఆరోపించారు. రేషన్ డీలర్లకు అన్యాయం చేస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. అధికార పార్టీపై మాణిక్యాల రావు నుంచి ఈ స్పందన ఊహించనిది.. కానీ బీజేపీ విధానం మాత్రం ఇప్పటికి ఇదేనని.. క్లారిటీ మాత్రం ఇస్తున్నారు.
అంతే కాదు.. కొద్ది రోజుల నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.. వైసీపీపై తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు. బీజేపీలో చేరే వాళ్లను.. వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని.. అలా చేస్తే.. టీడీపీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఆయన జిల్లాలు తిరిగి.. అన్ని పార్టీల నేతలను చేర్చుకుంటున్నారు. విచిత్రంగా.,. ఇలా బీజేపీలో చేరుతున్న వారిలో వైసీపీ నేతలూ భారీగానే ఉంటున్నారు. నిన్న విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కొంత మందికి కన్నా కండువా కప్పారు. అప్పుడూ అలాంటి విమర్శలే చేశారు. ఇక బడ్జెట్‌పై స్పందనలో… ఎమ్మెల్సీ మాధవ్ ప్రభుత్వం తీరును తప్పు పట్టారు. అన్నీ నగదు బదిలీ పథకాలకే నిధులు కేటాయిస్తే అభివృద్ధి సంగతేమిటని ప్రశ్నించారు.
భారతీయ జనతా పార్టీ.. ఏపీ విషయంలో.. సమీకరణాలను… పకడ్బందీగా అంచనా వేసుకుంటోందని.. బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుతోనే స్పష్టమవుతోందంటున్నారు. వైసీపీతో.. అంత దగ్గర కాదని.. విమర్శలతో నిరూపిస్తున్నారు. బీజేపీకి ఏ మాత్రం సందు ఇచ్చినా.. అది రాజకీయంగా తనకు ఏ మాత్రం మంచిదికాదన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని… అందుకే.. బీజేపీ విషయంలో.. జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు. అంతర్గతంగా ఆయన చేసుకుంటున్న ప్రయత్నాలు బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. అయితే.. ఎప్పుడూ లేని విధంగా విజయసాయిరెడ్డి కూడా ఢిల్లీలో.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. రాజ్యసభలో… బీసీ రిజర్వేషన్లపై.. ప్రైవేటు బిల్లు పెట్టి..ఓటింగ్‌కు పట్టుబట్టారు. ప్రభుత్వం కుదరదని చెప్పేసరికి.. ఆగ్రహంతో.. రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.