భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు బుధవారం విశాఖలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన పదవీ కాలం ముగిసేలోగా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటవుతుందని అన్నారు. నిజానికి ఆయన పదవీ కాలం ముగిసి సుమారు రెండు నెలలయిపోయింది. రాష్ట్రంలో తెదేపా, భాజపాల మధ్య ఒకరకమైన అనిశ్చిత వాతావరణం నెలకొని ఉండటంతో, నేటికీ ఆయననే అధ్యక్షుడు కొనసాగిస్తున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ‘వారం రోజులలోగా కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తామని’ చెప్పారు.
భాజపాకి తెదేపా రాజ్యసభ సీటు కేటాయించడంతో రెండు పార్టీల మద్య మళ్ళీ రాజీ కుదిరినట్లే కనిపిస్తోంది కనుక తెదేపాకి ఆమోదయోగ్యుడైన వ్యక్తినే అధ్యక్షుడుగా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం అధ్యక్షుడుగా కొనసాగుతున్న కంబంపాటి హరిబాబు, మిగిలిన వారిలాగ కాకుండా తెదేపాతో చాలా ఆచితూచి వ్యవహరిస్తారనే పేరుంది. ఆయన తెదేపాను ఇబ్బంది పెట్టరు అలాగని చూస్తూ ఊరుకోరు. అవసరమైనపోపుడు తెదేపాను విమర్శిస్తుంటారు. ఆయన అంత బ్యాలన్స్ గా వ్యవహరిస్తారు కనుకనే తెదేపా కూడా ఆయనకే మొగ్గు చూపుతోంది. కనుక మళ్ళీ ఆయననే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగించే అవకాశాలున్నాయి. ఆ లెక్కన ఆయనే మరో ఏడాది పాటు అధ్యక్షుడుగా కొనసాగవచ్చను కొంటే రైల్వే జోన్ మంజూరు అవడానికి కూడా మరో ఏడాది పడుతుందని ఆయన చెపుతున్నట్లు అనుకోవలసి ఉంటుంది. అలాకాక ఆయన స్థానంలో వేరేవరినైనా అధ్యక్షుడుగా నియమించదలిస్తే, వారం రోజులలోనే అది జరుగుతుందని స్వయంగా అమిత్ షా చెప్పారు కనుక ఆలోగానే రైల్వే జోన్ పై ప్రకటన వెలువడవచ్చు. వారం రోజుల్లోనే రైల్వే జోన్ వస్తుందా రాదా అనే సంగతి తేలిపోవచ్చు.