సోము వీర్రాజు ఏపీలోపార్టీని బలోపేతం చేసేందుకు శక్తికేంద్రాల ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో బూత్ కమిటీలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. నేరుగా పార్టీ అధ్యక్షుడు బూత్ కమిటీలతో టచ్‌లో ఉంటారు. వారు ఎక్కడుకు వెళ్లినా బూత్ కమిటీలతో సమావేశం కాకుండా ఉండరు. ఏపీకి ఎప్పుడు వచ్చినా ఈ బూత్ కమిటీలు ఎన్ని ఏర్పాటు చేశారనే లెక్కలు అడుగుతూ ఉంటారు. వాటిని ఏపీ బీజేపీ నేతలు సమర్పిస్తూ ఉంటారు.అయితే ఆ లెక్కల్లో ఉన్న బూత్ కమిటీలు నిజంగా ఉండవు. వీటికి తోడు బీజేపీ నాయకత్వం శక్తికేంద్రాలను ఏర్పాటు చేయమని ఆదేశించింది.
శక్తి కేంద్రాలంటే మూడు నుంచి ఆరు బూత్‌లను కలిపి కొత్తగా ఏర్పాటుచేసే కమిటి. ఈ శక్తి కేంద్రాలను ఎన్ని నియమించారంటే.. సోము వీర్రాజు దగ్గర సమాధానంలేదు. పోలింగ్ బూత్ కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే పార్టీ శ్రేణులను ఆదేశించింది. అందుకే శక్తికేంద్రాల ఏర్పాటును టార్గెట్‌గా పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో 15 వేల శక్తి కేంద్రాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని లక్ష్యంతో సోము వీర్రాజు పని ప్రారంభించారు. అందుకే.. జోనల్ సమావేశాలునిర్వహిస్తున్నారు. బుధవారంనుంచి నాలుగు రోజుల పాటు నాలుగు జోన్ల సమావేశాలు నిర్వహించి కేంద్ర పార్టీ తనను అడిగిన ప్రశ్నలనే వారిని అడగనున్నారు.
బూత్ కమిటీలు ఏవి.. శక్తి కేంద్రాలేవి అని ఆయన ప్రశ్నించనున్నారు. సోము వీర్రాజు మాత్రం మీడియాకు తమ పార్టీ బలోపేతం గురించి గొప్పగా చెబుతున్నారు. ఇప్పటికే 70 శాతం పోలింగ్ బూత్‌లకు ఇంచార్జ్‌లను నియమించేశామని.. శక్తి కేంద్రాలకు ప్రముఖ్‌లను నియమిస్తున్నామని చెబుతున్నారు. కానీ ఎక్కడా వారి కార్యకలాపాలు కనిపించవు. మెత్తంగా సోము వీర్రాజు…తన శక్తి మేర శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశానని పార్టీ హైకమాండ్‌ను నమ్మించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పైన నమ్మినా.. నమ్మకపోయినా పోయేదేమీ ఉండదు. వీర్రాజును మార్చాలనుకుంటే మారుస్తారు ..లేకపోతే లేదు.