తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఏపీ బీజేపీ నేతల హడావుడి మామూలుగా లేదు. ఏపీకి అన్యాయం చేశారంటూ.. తెలుగుదేశం పార్టీ … ప్రతి రోజూ గుక్క తిప్పుకోనీయకుండా ఎటాక్ చేస్తోంది. దానికి కేంద్ర ప్రభుత్వ నిర్వాకాలు కూడా కలసి వస్తున్నాయి. వారి ప్రకటనలు.. అఫిడవిట్లు.. ఇక్కడ నేతల తీరు..అన్నీ తెలుగుదేశం పార్టీ.. ప్రజల ముందు ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూనే ఉంది. ఇలా చేస్తున్నప్పుడల్లా.. బీజేపీ నేతలు… మీడియా ముందుకు వచ్చి… కేంద్రమే ఏపీకి అన్నీ ఇచ్చిందని.. ఆ విషయాన్ని ప్రజలకు చెబుతామని.. గ్రామగ్రామాన పర్యటిస్తామని ప్రకటనలు చేస్తూంటారు. ఇలా ప్రకటించే చాలా రోజులయింది. కానీ ఇంత వరకూ కార్యాచరణ లేదు. బీజేపీ… ఆంధ్రప్రదేశ్‌కు ఏమిచ్చిందో..అందరికీ చెబుతామంటున్నారు కానీ… ఎవరికైనా చెప్పడానికి కూడా ప్రయత్నించడం లేదు. కానీ మీడియా ముందు మాత్రం రొటీన్ గా డైలాగులు చెబుతూంటారు.
ఓ వైపు ఏపీ బీజేపీ నేతలు అదిగో రైల్వేజోన్.. ఇదిగో స్టీల్ ఫ్యాక్టరీ అని కబుర్లు చెబుతూంటారు. మరో వైపు కేంద్రం సుప్రీంకోర్టులో… అసాధ్యం… ఇవ్వలేము.. చేయలేము అని అఫిడవిట్లు దాఖలు చేస్తూంటారు. దీన్ని కూడా బీజేపీ నేతలు అడ్డగోలుగా సమర్థించుకుంటూ ఉంటారు. తమపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రజలకు నిజాలు చెబుతామంటారు. ఏపీ బీజేపీకి కొత్త ఇన్చార్జ్గా మురళీధరన్ నియమించిన తర్వాత .. బుధవారం విజయవాడలో జరిగిన తొలి కోర్ కమిటీ సమావేశంలోనూ.. ఏపీ బీజేపీ నేతలకు ఇంత కంటే ఎజెండా ఏమీ దొరకలేదు. తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనేదే.. ప్రధానంగా చర్చించారు. కానీ ఏం చేయాలో మాత్రం తేల్చుకోలేదు. అంతిమంగా… దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మాత్రం నిర్ణయించుకున్నారు.
పార్టీ పరంగా కూడా అలవికాని నిర్ణయాలు తీసుకున్నారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక జాతీయ నేతను ఇన్చార్జ్గా పెట్టుకుంటారట. గ్రామస్థాయిలో పర్యటనలు చేసి.. బూత్ కమిటీలను నియమించారట. సెప్టెంబర్‌లో అమిత్ షాతో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారట. వీటితో పాటు.. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల కోసం ప్రధానిని కలవాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా ఎన్నికలయిన తర్వాత ప్రధానిని కలిసినప్పుడు… విభజన చట్టంలో ఉన్న 19 అంశాలూ నెరవేర్చాలని లేఖ ఇచ్చారు. కానీ ఆ తర్వాత బీజేపీ నేతలు 90 శాతం హామీలు నెరవేర్చామని… చెప్పుకోవడం ప్రారంభించారు. మరి పది శాతం కోసం.. ఎందుకు ప్రధానిని కలవాలనుకుంటున్నారా..?.