గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా పూర్తైన నేపధ్యంలో, తెలంగాణ భారతీయజనతాపార్టీ, తెలుగుదేశం పార్టీని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశంతో మైత్రి బంధాన్ని ఒక భారంగా భారతీయజనతాపార్టీ నాయకులు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆపార్టీతో పొత్తులు ఇక మీదట వద్దే వద్దనీ, తమ సొంత బలాన్ని నమ్ముకోని కనీసం తెలంగాణ రాష్ట్రం వరకు ,కేవలం తమ సొంతకాళ్ల మీద నిలబడడానికే ప్రయత్నిస్తే కొంతమేరకైనా భవిష్యత్తు ఉంటుందనీ, తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టే పరిస్తితిని కొనసాగిస్తే ఇప్పుడు ఉన్నదానికంటే మరింత తీసికట్టుగా పరిస్తితి తయారవుతుందనీ, భారతీయజనతా పార్టీనాయకులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినాయకత్వం దగ్గరికి తీసుకువెళ్లి తెలంగాణ రాష్ట్రం వరకు తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకోవాలని వారు సూచిస్తున్నట్లుగా, బతిమాలుతున్నట్లుగా పార్టీవర్గాలనుండి సమాచారం అందుతుంది.
గత సార్వత్రిక ఎన్నికలకు పూర్వం తెలుగుదేశం పార్టీ, భారతీయజనతా పార్టీ ఇద్దరు పొత్తులుపెట్టుకున్నప్పటికీ, బీజేపీ నాయకులు ఆ పొత్తులను అయిష్టంగానే స్వీకరిస్తూ వచ్చారు. కిషన్రెడ్డి అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ పట్ల చాలా విముఖంగా, చాలా సందర్భాలలో తన అసంతృప్తిని బాహాటంగానే ప్రదర్శించారు. అయితే కింద మీదా పడుతూ ఆ ఎన్నికల్లో ఇద్దరు కలిసే పోటీ చేశారు. అప్పటి నుంచి కిషన్రెడ్డి గానీ, పార్టీ భారతీయజనతా పార్టీలోని చాలామంది సీనియర్ నాయకులుగానీ, తెలుగదేశంతో మిత్రపక్షంలాగా వ్యవహరిస్తూ వచ్చిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కూడా రకరకాల భేటీలు, మంతనాలు, మల్లగుల్లాల తర్వాత ఇద్దరూ వార్డులను పంచుకున్నారు. అయితే చివరికి ఇద్దరు కూడా ఏ మాత్రం పెద్దగా తేడా లేకుండా ఫలితాలను సాధించలేకపోయారు. అయితే పార్టీలు కలిసి పనిచేయడం వలన రెండు పార్టీలకు ఎలాంటి ప్రయోజనం, అదనపు ప్రయోజనం సమకూరాలో అలాంటి లభం ఈ ఇద్దరికీ కూడా దక్కకుండా పోయింది.
అదే అంశాన్ని బేస్ చేసుకుని తెలుగుదేశంతో మైత్రి మనకిక అక్కర్లేదంటూ వదిలించుకోవడానికి భాజపా రాష్ట్రనాయకత్వం, పార్టీ అధిష్టానానికి నివేదించనున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికలలో భారతీయజనతా పార్టీకీ నగరంలో ఐదు డివిజన్లు దక్కాయి. ఈసారీ తెలుగుదేశంతో పొత్తుపెట్టుకున్నందువల్ల కనీసం ఒక్కటైనా ఎక్కువ రావాలని ఏ పార్టైనా కోరుకుంటుంది. ఇది చాలా సహజమైన పరిణామం. కానీ ఈ ఎన్నికలలో భారతీయజనతా పార్టీకి కేవలం నాలుగే స్థానాలు దక్కాయి. అంటే తమకు సహజంగా బలం ఉన్న డివిజన్లను వాళ్లు దక్కించుకోగలిగారు తప్పా, తెలుగదేశం తో పొత్తు వల్ల వారికి అదనంగా వారికి ఒక్క ఓటుకూడా రాలేదన్నది సత్యం.పైగా ఉన్న డివిజన్లలో వారు ఒకటి అనవసరంగా కోల్పోవలసి వచ్చింది. తెలుగుదేశంతో పొత్తు వల్లనే ఇది కోల్పోయామనీ, ఆపొత్తేగనక లేకపోతే ఈసారీ కూడా కనీసం ఐదు డివిజన్లను కూడా దక్కించుకునే వాళ్లమనీ భారతీయజనతాపార్టీ ఇప్పుడు వాదిస్తే కాదనగలిగే వారేవరూ ఉండరు. ఇలాంటి నేపద్యంలో ఈ పరిణామాలంన్నిటినీ పార్టీ ఢిల్లీ కేంధ్ర జాతీయ నాయకత్వానికి నివేదిస్తూ తెలంగాణ రాష్ట్రం వరకు తెలుగుదేశం పార్టీతో పొత్తును వదిలించుకుంటే తప్పా భాజపాకు కూడా మనుగడ ఉండదనే సంగతినీ వారు పదే పదే నివేదిస్తున్నారనీ, పదేపదే అలోచిస్తున్నారనీ, పార్టీవర్గాలు తెలియజేస్తున్నాయి.