విజయవాడకు సీబీఐ కోర్టు ఇవ్వాలని.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు.. ఓ విజ్ఞాపన పత్రం అందింది. అక్రమాస్తుల కేసులో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవ్వాల్సి ఉన్నందున… హైదరాబాద్లో కాకుండా.. విజయవాడలో కోర్టు ఏర్పాటు చేస్తే.. అనుకూలంగా ఉంటుందని.. జగన్ తరపున ఏపీ సర్కార్.. ఈ ప్రతిపాదన కేంద్రానికి పంపలేదు. అ విజ్ఞాపన పత్రం ఇచ్చింది.. బీజేపీ నేతలు. అదీ కూడా ఆషామాషీ నేతలు కాదు.. జీవీఎల్ వంటి పలుకుబడి ఉన్న నేతలే. హఠాత్తుగా…కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వద్దకు వెళ్లిపోయిన జీవీఎల్ ఉన్న పళంగా… విజయవాడకు సీబీఐ కోర్టు కేటాయించాలని కోరారు.
ఏపీకి న్యాయశాఖ పరంగా రావాల్సిన అంశాలతో ఓ విజ్ఞాపన పత్రం అందించారు. ఇందులో సీబీఐ కోర్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విజయవాడకు సీబీఐ కోర్టు గతంలోనే మంజూరయిందని కానీ ఇంత వరకూ ప్రారంభం కాలేదని.. అది ప్రారంభమయ్యేలా చూడాలని… జీవీఎల్ బృందం..రవిశంకర్ ప్రసాద్ ను కోరింది. ఏపీకి సంబంధించిన అనేక అంశాలు పెండింగ్ లో ఉండగా.. బీజేపీ బృందానికి… ఒక్క కోర్టుల అంశమే ఎందుకు గుర్తొచ్చిందనేది.. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న చర్చ. ఏపీకి సంబంధించిన నిధులు.. బోలెడన్ని…కేంద్రం నుంచి రావాలని ఏపీ సర్కార్ వాదిస్తోంది. ఇరవైరెండు మంది ఎంపీలతో.. వైసీపీ పెద్దలు.. ఢిల్లీలో కేంద్రమంత్రుల్ని కలుస్తున్నారు.
కానీ ఎక్కడా సంతృప్తికరమైన సమాధానం రావడం లేదు. అయితే ఏపీ సర్కార్… అన్ని అడుగుతోంది కానీ.. ఈ కోర్టుల గురించి ఒక్క సారి కూడా రవిశంకర్ ప్రసాద్ వద్దకు వెళ్లలేదు. వైసీపీ ఏది అయితే అడగడం లేదో.. అది బీజేపీ అడుగుతోంది. మొత్తానికి బ్యాలెన్స్ చేసే ప్రయత్నాలను బీజేపీ వ్యూహాత్మకంగా చేస్తోందన్న అభిప్రాయం మాత్రం అంతటా వ్యక్తమవుతోంది.