ఉన్న 119 స్థానాల్లో 110 చోట్ల డిపాజిట్లు రావని.. పొన్నం ప్రభాకర్ లాంటి కాంగ్రెస్ నేతలు వెటకారం చేయవచ్చు గాక..! ఒక్క సీటు గెలుచుకుని చూపించాలని.. కేటీఆర్ లాంటి వాళ్లు సెటైర్లు వేయగాక..! అసలు బీజేపీ తెలంగాణలో ఎక్కడుందని నేరుగానే కేసీఆర్ తీసి పారేయవచ్చు గాక…! … కానీ తెలంగాణలో బీజేపీ టిక్కెట్లకు మాత్రం… టీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ను తట్టులోక.. సింగిల్ అభ్యర్థి మాత్రమే రేసులో ఉన్న 38 మంది స్థానాల్లో క్యాండిడేట్లను ప్రకటించారు. వీరిలో ఆరుగులు తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి ఉన్నది ఇప్పుడు ఐదుగురే కదా అన్న డౌట్ రావొచ్చు కానీ.. ఆరో వ్యక్తి.. టిక్కెట్ నిరాకరించిన బాబూమోహన్. మళ్లీ ఆయనకు ఆందోల్ టిక్కెట్ ఇచ్చారు బీజేపీ నేతలు. నిజామాబాద్ అర్బన్ నుంచి యెండల లక్ష్మినారాయణ, సూర్యాపేట నుంచి సంకినేని వెంకటేశ్వర్రావు , దుబ్బాక నుంచి రఘునందన్ రావు తప్ప తెలిసిన మొహాలేవీ జాబితాలో లేవు.
దీని కోసం.. ఢిల్లీలో కసరత్తు మామూలుగా జరగలేదు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వెయ్యిమందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొన్నిచోట్ల ఒక్కో నియోజకవర్గంలో 10 నుంచి 15 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఖరారు కోసం క్యాడర్ మధ్య ఏకాభిప్రాయం తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
రాష్ట్ర పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తున్న నేతలు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు, పార్టీలో కొంత బలంగా ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోలేదు. పిలిచి టిక్కెట్ ఇస్తారని వారి నమ్మకం కావొచ్చు. ఇలాంటి వారిలో… ఓ హీరోయిన్ కూడా ఉన్నారండోయ్. ఆమె… మాధవీలత కాదు. ఇంకో హీరోయిన్ రేష్మారాథోడ్. పేరు ఇలా చెబితే గుర్తు కాదు కానీ.. మారుతిని.. మంచి ఇమేజ్ తెచ్చి పెట్టిన ఈ రోజుల్లో సినిమా గుర్తుంది కదా… ఆ సినిమాలో హీరోయిన్ రేష్మా… ఇటీవలి కాలంలో బీజేపీలో చేరారు. ఆమె ఖమ్మం జిల్లా వైరా టిక్కెట్ పై కన్నేశారు. కానీ ధరఖాస్తు చేసుకోలేదు. పిలిచి ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు.
నిజానికి మిగతా నియోజకవర్గాల్లో మహాకూటమి అభ్యర్థుల్ని ప్రకటించే వరకూ.. మళ్లీ జాబితా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే.. ఆయా పార్టీల్లో సీటు దక్కని వాళ్లు వస్తారని ఆశ మరి. వారు రాగానే కండువా కప్పి.. బీజేపీ తరపున పోటీ చేయించాలనే ఆలోచనలో.. మిగతా టిక్కెట్లు… బ్లాంక్ బీఫామ్స్ ను హైదరాబాద్ పంపించే అవకాశం ఉంది.