దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కలిపి స్థిరాస్తులు దాదాపుగా రూ. ఏడు వేల కోట్లు ఉంటాయని ఏడీఆర్ అనే సంస్థ అధికారిక డాక్యుమెంట్లు.. ఆయా పార్టీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా లెక్కించింది. ఈ ఏడు వేల కోట్లలో ఒక్క బీజేపీకే రూ. ఐదు వేల కోట్ల వరకూ ఉన్నాయి. మిగిలిన రెండు వేల కోట్లు అన్ని రాజకీయ పార్టీల ఆస్తులు. దేశాన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సుదీర్ఘంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆ పార్టీ పెద్దగా ఆస్తులు పోగేసుకోలేదు. బీఎస్పీ కన్నా తక్కువ ఆస్తులే ఆ పార్టీకి ఉన్నాయి.
బీజేపీకి స్థిరాస్తులు రూ. 4847 కోట్లుఉన్నాయి. దేశంలో మరే జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీకి కనీసం రూ. వెయ్యి కోట్ల స్థిరాస్తులు లేవు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్థిరాస్తులు కేవలం రూ. 588 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ కన్నా బీఎస్పీకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. రూ.698 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల్లో సమాజ్ వాదీ పార్టీకి రూ . 563 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న టీఆర్ఎస్కు రూ. 301 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో అన్నాడీఎంకే, టీడీపీ ఉన్నాయి.
దేశంలో విరాళాల్లో అయినా ఆస్తుల్లో అయినా బీజేపికి సరితూగే పార్టీ లేదు. ఆస్తులు మాత్రమే కాదు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ప్రతి ఏడాది వందల కోట్లలో విరాళాలు వస్తూ ఉంటాయి. కొసమెరుపేమిటంటే ఇప్పుడు కూడా ఆ పార్టీ కార్యకర్తల నుంచి విరాళాల సేకరణ చేస్తోంది. పార్టీ బలోపేతం కోసం ఎంతో కొంత విరాళం ఇవ్వాలని ప్రజల్ని కోరుతూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఎంత ఆస్తి.. ఆదాయం ఉన్నా.. బీజేపీకి సరిపోవడం లేదేమో ?