ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షంగా వున్న బిజెపితో తెలుగుదేశం సంబంధాలు తెలంగాణాలో శత్రుపూరితంగానే వుండబోతున్నాయి. ”మీరు ఇక్కడ బిజెపి మీద దాడులు చేయవచ్చు అందుకు మీకు పూర్తి స్వేచ్ఛవుంది” అని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్ లో తమ పార్టీ నాయకులకు క్లియరెన్సు ఇచ్చారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో టీ.టీడీపీనేతలతో భేటీ అయిన చంద్రబాబు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్శింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, పెద్దిరెడ్డి తదితరులు హాజరైన ఈ సమావేశంలో తిరుపతి మహానాడులో తెలంగాణపై చేసిన తీర్మానాలపైనా చర్చించారు.వాటిపై పార్టీ అధ్యక్షుడు వివరణలు ఇచ్చారు.
బీజేపీ తమకు సహకరించడం లేదని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినపుడు ”తెలంగాణలో బీజేపీకీ, మనకూ ఎలాంటి సంబంధం లేదు… అవసరం సందర్భం వచ్చినపుడు రాజకీయంగా బీజేపీపై కూడా దాడి చేయవచ్చునని” వారికి సూచించారు. అందుకు పూర్తి స్వేచ్చనిస్తున్నట్టు ఆయన తెలంగాణా టీడీపీ నేతలతో చెప్పారు.
గతంలో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనుకున్నారని, కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్ లో విలీనం చేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కష్టపడితే పార్టీ అభివృద్ధి చెందుతుందని సూచించారు.
తెలంగాణలో పార్టీని పట్టించుకోవడం లేదని వస్తున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. రెండు రాష్ట్రాలూ నాకు ముఖ్యమే. నీటి వివాదం, హైకోర్టు విభజన విషయంలో అనవసరంగా నన్ను నిందిస్తున్నారు. ఆవిమర్శలను మీరు ఎందుకు తిప్పికొట్టడంలేదు? విభజన చట్టంలో ఉన్న విధంగానే మనం నడుచుకుంటున్న విషయాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకు వెళ్ళడం లేదు అని కూడా తెలంగాణా నాయకుల్ని చంద్రబాబు ప్రశ్నించారని తెలిసింది.