తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ.. భారతీయ జనతా పార్టీని టార్గెట్ గా చేసుకుని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారన్న విషయం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో వీలైనంత సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకే ప్రాంతీయ పార్టీలన్నీ ఆసక్తి చూపిస్తున్నాయి. దానికి విరుద్ధంగా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం.. కేంద్రానికి ఎదురెళ్లాలనుకోవడమే… అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తం కావడానికి కారణం. ఇద్దరూ కలిసి బీజేపీనే టార్గెట్ చేయబోతున్నారన్న విషయం తెలియడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల కాషాయ నేతలు… విమర్శలు ప్రారంభించారు. స్వప్రయోజనాల కోసమేన.. కేసీఆర్, జగన్ భేటీలు జరుగుతున్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తేల్చేశారు. వైఎస్ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల చేసిన భూదందాలు బయటకు రాకుండా ఉండేందుకే .. కేసీఆర్‌ను తరుచూ జగన్ కలుస్తున్నారని సంజయ్ చెబుతున్నారు. జగన్, కేసీఆర్ ఎన్నిసార్లు భేటీ అయినా బీజేపీని ఏమీ చేయలేరని …స్పష్టం చేశారు. ఎలక్షన్ల ముందు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాటకాలు ఆడిన కేసీఆర్.. ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కూడా.. కేసీఆర్ – జగన్ భేటీపై.. తీవ్రంగా స్పందించారు. ఏదో గూడుపుఠాణిని.. కేసీఆర్‌తో కలిసి జగన్ చేస్తున్నారని.. అది కచ్చితంగా.. బీజేపీపైనేనని వారు నమ్ముతున్నారు. బీజేపీ సభ్యత్వ కార్యక్రమం ఇన్చార్జ్గా ఉన్న మాణిక్యాలవు.. కేసీఆర్ – జగన్ రహస్య మంతనాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంత సీక్రెట్‌గా ఎందుకు చర్చలు జరపాల్సి వస్తోందని ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం రహస్య జీవోలు జారీ చేసి ఎందుకు రద్దు చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. మరో బీజేపీ నేత పురుందేశ్వరి కూడా ఇదే తరహా విమర్శలు ప్రారంభఇంచారు. గోదావరి జలాల విషయంలో.. జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులపై.. ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీకి హోదా ఇచ్చే అవకాశంలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినా.. జగన్ పదేపదే హోదాపై మాట్లాడటం సరికాదన్నారు.
మరో వైపు జగన్ – కేసీఆర్ పదే పదే భేటీ అవుతూండటంపై రాయలసీమ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ లు నిర్వహిస్తున్న సీనియర్ నేతలు కూడా అసహనంతో ఉన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం.. కేసీఆర్‌కు ఏపీని జగన్ తాకట్టుపెడుతున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు. ఏపీ విషయంలో జగన్ చారిత్రక తప్పిదం చేస్తున్నారని.. గోదావరి మిగులు జలాలపై… కేసీఆర్ ప్రతిపాదనకు జగన్ అంగీకరించడం గర్హనీయమంటున్నారు. మొత్తానికి జగన్ – కేసీఆర్.. తమ ఆలోచనలు రాజకీయమో.. అభివృద్ధి పరమో తెలియదు కానీ.. చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అభిప్రాయంలో ఉన్నారు. తమనే గురి పెడుతున్నారని బీజేపీ భావిస్తోంది. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని.. ఏపీ రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.