లోక్‌సభ ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. బీజేపీని వ్యతిరేకించే.. కాంగ్రెస్ నేతలు.. వారితో పొత్తులో ఉన్న వారి వెంట ఈడీ పడుతోంది. తమ రాష్ట్రాల్లోకి రాకుండా సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేయడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ సర్కార్ ఈడీని వాడుకుంటోంది. లేనిపోని అధికారాలు కట్టబెట్టి.. రాజకీయ ప్రత్యర్థుల అరెస్టులకు తెగ బడుతోంది. స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్టు చేశారు. రేపో మాపో అరవింద్ కేజ్రీవాల్ నూ జైలుకు పంపనున్నారు. ఇప్పటికే ఆయనకు ఐదో సారి సమన్లు జారీ చేశారు.
ఈడీ వేటాడుతున్న ప్రతిపక్ష ముఖ్యమంత్రుల్లో సొరేన్ నాలుగో వారు. గతంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భూపేష్ బఘేల్, ఆయన సన్నిహితులపై ఈడీ పంజా విసిరింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వారిపై అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ కేసు నమోదు చేసింది. దీనిని బీజేపీ ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంది. ముఖ్యమంత్రి అవినీతిపరుడంటూ ఆరోపణలు గుప్పించింది. ఇక బీహార్‌లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లను కూడా ‘ఉద్యోగాలకు భూమి’ కేసులో ప్రశ్నిస్తోంది. తృణమూల్ నేతలపైనా ఈడీ గురి పెట్టింది. ఇటీవల ఈడీ హడావుడి పెరగడంతో బెంగాల్ లో వారిప ైదాడి కూడా జరిగింది. తృణమూల్ మంత్రి జ్యోతి ప్రియ మల్లిక్‌ను గత సంవత్సరం అక్టోబర్ 23న ఈడీ అరెస్ట్ చేసింది. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.
బీజేపీలో చేరినా.. బీజేపీకి సామంతులుగా మారినా వారిపై చర్యలు ఉండటం లేదు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్దారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై పలు కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బీజేపీలో చేరకముందు పవార్‌పై కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. అయితే ఆయన కాషాయదళంలో చేరగానే కడిగిన ముత్యమై పోయారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో నమోదైన వ్యాపమ్ వంటి అనేక పాత కేసులు ఇప్పుడు అటకెక్కాయి. కర్నాటకలో యడ్యూరప్ప, బీఎస్ బొమ్మై ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు నమోదైన అనేక చిన్న, పెద్ద అవినీతి కేసుల గతీ అంతే. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఈ కేసుల్లో పలువురు మంత్రులు నిందితులుగా ఉన్నారు.
గత సంవత్సరం మార్చి వరకూ ఈడీ 5,906 కేసులు నమోదు చేసింది. ఈడీ, సీబీఐ పెట్టిన కేసుల్లో 95శాతం కేసులు ప్రతిపక్ష నాయకులపై పెట్టినవే. ఈడీ, సీబీఐ నమోదు చేయబోయే కేసుల వివరాలను బీజేపీ నాయకులు ముందుగానే బహిర్గతపరుస్తూ తామే చేయిస్తున్నామని బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు.