పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది. నామినేషన్ల పర్వం ఇప్పటికే ముగియగా .. పలు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను బరిలో నిలిపిందన్న ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ ఆదేశాలతోనే మూడు పార్లమెంట్ స్థానాల్లో ఇతరులకు కూడా పార్టీ బీ ఫాం ఇచ్చిందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
పెద్దపల్లి, నల్గొండ, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పార్టీ మరికొందరి నేతలతో నామినేషన్ వేయించిందని టాక్ నడుస్తోంది. నల్గొండ నుంచి నూకల నరసింహ రెడ్డి, పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్ , హైదరాబాద్ నుంచి సుభాష్ చందర్ తో బీజేపీ నామినేషన్ వేయించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి , పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిని మార్చుతారని , బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతను బీజేపీ అభ్యర్థిగా బరిలో దించుతుందని ప్రచారం జరిగింది. కానీ , గోమాస శ్రీనివాస్ కే బీ ఫాం ఇచ్చినా మరో నేతను కూడా రంగంలోకి దింపిందన్న చర్చ జరుగుతోంది.
నల్గొండ అభ్యర్థిగా సైదిరెడ్డిని ప్రకటించినా బీఆర్ఎస్ నేత తేరా చిన్నప్పరెడ్డిని పార్టీలో చేర్చుకొని బీజేపీ బరిలో నిలుపుతుందని లీకులు వచ్చాయి. బీజేపీ నేతలకు సైదిరెడ్డికి మధ్య ఏమాత్రం పొసగడం లేదని దాంతో అభ్యర్థి మార్పు ఖాయమని స్థానిక నేతలు చెప్పుకొచ్చారు. కానీ, అక్కడ నూకల నరసింహ రెడ్డితో కూడా బీజేపీ నామినేషన్ వేయించిందని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత హనుమాన్ శోభా యాత్రలో వివాదాస్పదంగా వ్యవహరించారు.మసీదుకు బాణం గురి పెట్టినట్లుగా ఇచ్చిన ఫోజ్ వ్యవహారంపై పార్టీ పెద్దలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు ఈ కారణంగానే బీ ఫాం ఆలస్యంగా ఇచ్చారు. దాంతో ఇక్కడి నుంచి మరొకరికి కూడా బీ ఫాం జారీ చేసినట్లుగా చర్చ జరుగుతోంది. కంటోన్మెంట్ విషయంలోనూ బీజేపీ ఇదే చేసిందనే టాక్ బలంగా నడుస్తోంది.
బీజేపీ ఇలా ఎందుకు చేసిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి అవుతాయనే ఆలోచనతోనే ముందు జాగ్రత్తగా మరో నేతతో కూడా నామినేషన్ వేయించారా అని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.